Delhi Capitals: లక్కు లేని ‘లక్నో’.. గడగడలాడించిన కేఎల్ రాహుల్, పోరెల్.. ఢిల్లీ ఘన విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ఐపీఎల్ టైటిల్ కోసం హోరా హోరీగా ఆడుతున్నాయి. ఇందులో భాగంగానే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఉత్కంఠ భరీతమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ తన సొంత గడ్డపై ఓటమి పాలు అయింది.

మొదట టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టు ఓపెనర్లు దూకుడుగా ఆడారు. దాదాపు పది ఓవర్ల వరకు ఒక వికెట్ పడకుండా పరుగులు రాబట్టారు. ఈ 10 ఓవర్లలో 0 వికెట్ నష్టానికి 87 పరుగులు సాధించారు. ఓపెనర్లు మార్కరం, మిచెల్ మార్స్ బాగా రాణించారు. ఫోర్లు సిక్సర్లతో పరుగులు పెట్టించారు. దీంతో లక్నో జట్టు మంచి స్కోర్ చేస్తుందని అంతా భావించారు. కానీ అనుకోని విధంగా తారుమారయింది.

ఒకసారిగా నాలుగు వికెట్లు డమాల్ మని పడిపోయాయి. దీంతో 14 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 110 పరుగులు సాధించారు. కేవలం 23 పరుగులు వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్నో చిక్కుల్లో పడింది. ఇలా వరుస వికెట్లు కోల్పోయి నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మార్కరం 33 బంతుల్లో 52 పరుగులు చేశాడు. మిచెల్ మార్స్ 36 బంతుల్లో 45 పరుగులు, బదోని 21 బంతుల్లో 36 పరుగులు, పురన్ 9 పరుగులు చేశారు.

ఈ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ జట్టు మొదట్నుంచి మంచి ప్రదర్శన చేస్తూ వచ్చింది. పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, పోరెల్ విజృంభించారు. ఆ తర్వాత 12వ ఓవర్లో పోరల్ అవుట్ అయ్యాడు. అప్పటికి 105 స్కోర్ ఉంది. లక్ష్యం చిన్నది కావడంతో ఆ తర్వాత రాహుల్, అక్షర పటేల్ చెలరేగిపోయారు. దీంతో 13 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యాన్ని ఛేదించింది.

కేవలం 17.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి టార్గెట్ అందుకుంది. దీంతో ఎనిమిదో మ్యాచ్లో ఆరో విజయాన్ని ఢిల్లీ తన ఖాతాలో వేసుకుంది. కేఎల్ రాహుల్ 42 బంతుల్లో 57 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పోరెల్ 36 బంతుల్లో 51 పరుగులు, అక్షర పటేల్ 20 బంతుల్లో 34 పరుగులతో సత్తా చాటారు.

తరవాత కథనం