కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ ఆదివాసి తెగపై చేసిన కామెంట్లు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. పహల్గంలో టెర్రరిస్టుల ఉగ్రదాడిపై మాట్లాడుతూ.. పాకిస్తాన్ వాళ్లకి చదువు ఉంటే ఇలా ప్రవర్తించే వాళ్ళు కాదు. వాళ్లు 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు కొట్టుకుంటున్నారు.
దాడులు విధ్వంసం సృష్టిస్తూ కామన్ సెన్స్ లేకుండా బుద్ధి లేకుండా దారుణాలు పాల్పడుతున్నారు అంటూ మాట్లాడాడు. అతడి మాటలపై లాయర్ కిషన్ చౌహాన్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇది సంచలనంగా మారింది. దీనిపై విజయ్ దేవరకొండ స్పందించాడు. తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు కొంతమంది ప్రజలలో ఆందోళన కలిగించిందని తన దృష్టికి వచ్చిందని అన్నాడు.
ఇప్పుడు దానిని స్పష్టం చేయాలనుకుంటున్నాను అని తెలిపాడు. ఏ సమాజాన్ని గాని, షెడ్యూల్డ్ తెగలను గాని బాధ పెట్టడం తన ఉద్దేశం కాదని పేర్కొన్నాడు. తాను ఆదివాసి గిరిజనులను ఎంతగానో గౌరవిస్తానని తెలిపాడు. దేశ ఐక్యత, మనం ముందుకు ఎలా సాగాలి అనే విషయం గురించి మాత్రమే తాను మాట్లాడాను అని అన్నాడు.
తాను చేసిన మాటల వల్ల ఎవరైనా బాధ పడిఉంటే దానికి హృదయపూర్వకంగా విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నాడు. తాను కేవలం శాంతి, ఐక్యత, అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడానని తెలిపాడు. ఎవరిని వేరు చేయాలనేది ఎప్పటికీ తన ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికైనా ఈ వివాదం సైలెంట్ అవుతుందో లేదో చూడాలి.