ఈ రోజుల్లో దంత క్షయాల సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. పిల్లల నుండి పెద్దల వరకు.. ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో పోరాడుతున్నారు. దంతాల బయటి గట్టి పొరను (ఎనామెల్) దెబ్బతీయడం వల్ల ఇది ఏర్పడుతుంది. నిజానికి కావిటీస్‌కు అనేక కారణాలు ఉన్నాయి. దంతాల శుభ్రత లేకపోవడం, నోటిలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, తీపి పదార్థాలను అధికంగా తీసుకోవడం లేదా ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు.. ఇలాంటివి దంతాలు చెడిపోవడానికి కారణమవుతాయి.
చాలా సందర్భాలలో పంటి నొప్పి అధికంగా వస్తుంది. ఆ సమయంలో సరైన డెంటిస్ట్ లేకపోతే మరింత నొప్పి పెరిగిపోతుంది. దీని వల్ల ఫీవర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే అలాంటి సమయంలో నొప్పిని తగ్గించడంలో ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు బాగా సహాయపడతాయి. అందులో వెల్లుల్లి అతి ముఖ్యమైనది. దీని వల్ల పంటి నొప్పిని ఈజీగా నివారించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
వెల్లుల్లి ప్రయోజనం
వెల్లుల్లి పంటి నొప్పికి ఉపశమనం అందిస్తుంది. ఇది దాని ఔషధ లక్షణాలకు చాలా కాలంగా ప్రశంసించబడింది. తాజాగా నలిపిన లేదా ముక్కలు చేసిన వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. పంటి నొప్పికి కారణమయ్యే కొన్ని సూక్ష్మజీవులను చంపడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.
వెల్లుల్లి పొడి – లవంగం
పంటి నొప్పి సమయంలో తాజా వెల్లుల్లి లేకపోతే వెల్లుల్లి పొడిని ఉపయోగించి పంటి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. వెల్లుల్లి పొడిలో అల్లిసిన్ పెద్దమొత్తంలో ఉండదు. అందువల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం పొందాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి సమయంలో లవంగాలను మరో ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. లవంగాలను నమిలినప్పుడు, ముక్కలుగా కోసి నోట్లో దంతాల వద్ద పెట్టుకున్నపుడు అది కొంతవరకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది.
వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలి?
దెబ్బతిన్న పంటితో తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బను సున్నితంగా నమలండి. ఇది అల్లిసిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అనంతరం మీ నొప్పికి దోహదపడే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
ఒకవేళ లవాంగాన్ని ఉపయోగిస్తే.. నమిలిన లవంగాన్ని దంతాలపై ఉంచడానికి ప్రయత్నించాలి.
వెల్లుల్లిని మోర్టార్ తో లేదా చెంచా వెనుక భాగంతో నలిపి, దానికి కొద్దిగా ఉప్పు కలపండి. ఇది యాంటీమైక్రోబయల్, వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది.