బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తన తదుపరి చిత్రం ‘కింగ్’ షూటింగ్ సమయంలో గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం. ముంబైలోని ఒక స్టూడియోలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో భాగంగా ఆయనకు గాయాలైనట్లు వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
నివేదికల ప్రకారం.. ఇది తీవ్రమైన గాయం కానప్పటికీ, కండరాల సంబంధిత గాయం (muscular injury) అని తెలుస్తోంది. అయితే వైద్యులు అతనికి కనీసం ఒక నెల రోజుల విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో షారుక్ తన బృందంతో కలిసి చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ గాయం కారణంగా ‘కింగ్’ సినిమా షూటింగ్ జూలై మరియు ఆగస్టు నెలలకు వాయిదా పడింది. తదుపరి షెడ్యూల్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో షారుక్ పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుక్ ఖాన్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇది సుహానా ఖాన్ బిగ్ స్క్రీన్ డెబ్యూ కావడం విశేషం.
ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న హై-ఆక్టేన్ యాక్షన్ చిత్రం ‘కింగ్’. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఇది ఒకటి. పఠాన్’, ‘వార్’, ‘బ్యాంగ్ బ్యాంగ్’ వంటి భారీ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించి సక్సెస్ సాధించిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షారుఖ్ ఖాన్ మరోసారి భారీ యాక్షన్ అవతారంలో కనిపించనున్నారు.
సినిమాలో అనేక ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్ సన్నివేశాలు ఉంటాయని అంచనా. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సుహానా ఖాన్ తల్లి పాత్రలో రాణీ ముఖర్జీ నటిస్తున్నట్లు సమాచారం. షారుఖ్-రాణీ కాంబినేషన్ గతంలో అనేక విజయవంతమైన చిత్రాలను అందించింది. విలన్ పాత్రలో అభిషేక్ బచ్చన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక పాత్రలో దీపికా పదుకొణె కూడా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
‘కింగ్’ సినిమా బడ్జెట్ గురించి అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇది ఒక భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ వంటి ప్రముఖులు ఉండటంతో పాటు, భారీ యాక్షన్ సన్నివేశాలు, లొకేషన్లు, విజువల్ ఎఫెక్ట్స్ వంటి వాటికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. కొన్ని అంచనాల ప్రకారం, ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ. 200 కోట్ల నుండి రూ. 300 కోట్ల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.






