ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. డార్లింగ్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ షూటింగ్ సెప్టెంబర్ చివరి వారం నుండి మొదలవుతుందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. విజయ్ దేవరకొండతో జరిగిన ‘కింగ్డమ్’ ప్రమోషన్స్ సందర్భంగా వంగా ఈ విషయాన్ని ధృవీకరించారు.
‘స్పిరిట్’ షూటింగ్ ప్రారంభమైన తర్వాత నాన్-స్టాప్ భారీ షెడ్యూల్స్ ఉంటాయని వంగా స్పష్టం చేశారు. ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సినిమాను పూర్తి చేసుకున్న తర్వాత ‘స్పిరిట్’ టీమ్‌లో చేరనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారని వంగా గతంలోనే తెలిపారు. ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి పూర్తిస్థాయి పోలీస్ పాత్రలో నటించడం, అది కూడా సందీప్ వంగా దర్శకత్వంలో కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
‘స్పిరిట్’ తొమ్మిది భాషల్లో పాన్-వరల్డ్ స్థాయిలో విడుదల కానుంది. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘స్పిరిట్’ ఒక గంభీరమైన కాప్ స్టోరీగా ఉంటుందని, ప్రభాస్ చాలా లీన్ బాడీతో కనిపించనున్నారని తెలుస్తోంది. త్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా 2027లో విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ‘స్పిరిట్’ తర్వాత సందీప్ వంగా తన బ్లాక్‌బస్టర్ ‘యానిమల్’ కు సీక్వెల్‌గా ‘యానిమల్ పార్క్’ ను రూపొందించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఆ తర్వాతే ‘స్పిరిట్’ షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ కొత్త అప్‌డేట్‌తో ప్రభాస్ అభిమానుల ఉత్సాహం మరింత పెరిగింది.






