పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం “హరి హర వీర మల్లు”. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నేడు (జూలై 21) హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన పాస్‌ల గురించి చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ అభిమానులకు ఒక ముఖ్యమైన నోట్‌ను విడుదల చేసింది.
ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్‌తో పాటు, కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు, ప్రముఖ దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇతర సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు సమాచారం.
పాస్‌లపై కీలక ప్రకటన:
మెగా సూర్య ప్రొడక్షన్స్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అభిమానులను ఉద్దేశించి ఒక నోట్‌ను విడుదల చేసింది.
‘‘పవన్ కళ్యాణ్‌ను చూడటానికి ‘హరి హర వీర మల్లు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం మీరంతా ఎంతగా ఎదురు చూస్తున్నారో మాకు తెలుసు. మీ ప్రేమ, ఆదరణ మాకు కావాలి. అయితే ఒక చిన్న విజ్ఞప్తి. సరైన పాస్‌లు ఉన్న వారికి మాత్రమే ఈవెంట్‌కు అనుమతి ఉంది. ప్రతి ఒక్కరి భద్రతతో పాటు, ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం. దయచేసి పాస్‌లు లేని అభిమానులు వేదిక చుట్టుపక్కల ప్రాంతాల్లో గుమిగూడ వద్దని కోరుతున్నాం. అందరం కలిసి మన చీఫ్ ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకుందాం.’’ అంటూ రాసుకొచ్చింది.
ఈ ప్రకటన ద్వారా ఈవెంట్‌లోకి ప్రవేశానికి పాస్‌లు తప్పనిసరని, పాస్‌లు లేనివారు గుమికూడి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకూడదని చిత్ర నిర్మాతలు విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నందున, ఆయన ఈ సినిమా ప్రమోషన్లలో పెద్దగా పాల్గొనలేదు. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆయన పాల్గొనే ఒక ముఖ్యమైన కార్యక్రమం కానుంది.






