కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్నారు. అతడు నటిస్తున్న ‘థగ్ లైఫ్’ మూవీ జూన్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నడ భాష వచ్చిందే తమిళం నుంచి అని కమల్ అనడంతో అది కాస్త వివాదానికి కారణమైంది.
ఇప్పుడంతా ఇదే రచ్చ కొనసాగుతోంది. కన్నడలో కమల్ హాసన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇక ఈ కాంట్రవర్సీ మరింత ముదరడంతో ఈ వివాదంపై కమల్ స్పందించాడు. ‘‘నేను ఈ విషయం ప్రేమతోనే చెప్పాను. ప్రేమ ఎప్పుడూ క్షమాపణ కోరదు. తమిళం నుంచి కన్నడ వచ్చిందన్న విషయం చరిత్రకారులే చెప్పారు. దీనిని వాళ్లకే వదిలేయాలి’’ అని సూచించాడు. దీంతో అతడి వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు.
ఈ వివాదంపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమల్ హాసన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్లకు అతడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని.. లేకపోతే.. అతడు నటించిన థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో రిలీజ్ కానివ్వమని తెలిపింది. మే 30లోపు పబ్లిగ్గా కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఛాంబర్ ప్రెసిడెంట్ నరసింహలు గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ చేసింది ముమ్మాటికి చాలా తప్పు అని అన్నారు.
కన్నడలో చాలా గ్రూపులు కమల్ చిత్రాన్ని బహిస్కరించాలని తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. అందువల్ల తామంతా సమావేశమై చర్చించామని.. ఇందులో కమల్ క్షమాపణ చెప్పాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చామని తెలిపారు. ఈ మేరకు కమల్‌ను కలిసి మాట్లాడాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు.