kantara chapter 1 shooting wrap: కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి.. మేకింగ్ వీడియో చూశారా?

పాన్-ఇండియా సెన్సేషన్ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతార – ఎ లెజెండ్: చాప్టర్ 1’ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించడమే కాకుండా, సినిమా మేకింగ్ విశేషాలను తెలియజేస్తూ “వరల్డ్ ఆఫ్ కాంతార” పేరుతో ఒక అద్భుతమైన గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

250 రోజుల షూటింగ్:

దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్రలో నటిస్తున్న రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ కోసం మూడేళ్లకు పైగా అకుంఠిత దీక్షతో పనిచేశారని, దాదాపు 250 రోజులు షూటింగ్ జరిగిందని మేకింగ్ వీడియోలో వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ తమ కల అని, కేవలం సినిమా కాదని, ఒక శక్తి అని రిషబ్ భావోద్వేగంగా చెప్పారు.

విడుదలైన మేకింగ్ వీడియోలో ‘కాంతార’ ప్రపంచం, దాని భారీతనం, అద్భుతమైన విజువల్స్, నటీనటులు, సాంకేతిక నిపుణుల కష్టం స్పష్టంగా కనిపిస్తోంది. రిషబ్ శెట్టి ఈ సినిమా కోసం శారీరకంగా మారిన తీరు, యుద్ధ సన్నివేశాల కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, కలరిపయట్టులో 3 నెలల శిక్షణ తీసుకోవడం వంటి విషయాలు వీడియోలో ఆకట్టుకున్నాయి. దాదాపు 500 మందికి పైగా శిక్షణ పొందిన యోధులు, 3000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం.

హోంబాలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా, అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీని, వినేష్ బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షించారు.

కాగా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కొన్ని అవాంతరాలు ఎదురైనట్లు గతంలో వార్తలు వచ్చాయి. జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడటం, భారీ వర్షాల కారణంగా సెట్స్ ధ్వంసం కావడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, అన్ని అడ్డంకులను అధిగమించి, చిత్రబృందం విజయవంతంగా షూటింగ్‌ను పూర్తి చేసింది.

‘కాంతార’ మొదటి భాగం సాధించిన అద్భుత విజయం నేపథ్యంలో, ‘కాంతార చాప్టర్ 1’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన మేకింగ్ వీడియో ఈ అంచనాలను మరింత పెంచింది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం