Mahavatar Narasimha: యానిమేటెడ్ సీరీస్ మహావతార్ నరసింహా బాక్సాఫీస్ వద్ద నిజమైన స్టార్ పవర్ ని ప్రదర్శించింది. పెద్ద స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ లేకపోయినప్పటికీ అంచనాలకు మించి భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి.. రికార్డులు సృష్టించింది. ఇండియన్ ఇండస్ట్రీలో ఒక యానిమేటెడ్ సీరీస్ ఈ రేంజ్ లో విజయం సాధించడం ఇదే తొలిసారి.
జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు అంతంత మాత్రం కలెక్షన్లు సాధించింది. కానీ, ఆ తర్వాత మౌత్ టాక్ ద్వారా దూసుకుపోయింది. సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడు పాజిటివ్ రివ్యూ వస్తుండడంతో ఆదరణ పెరిగింది. హిందీ వెర్షన్ నుంచే రూ. 126 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తెలుగులో కూడా సినిమా మంచి వసూళ్లు సాధించింది. అయితే తాజాగా ఈ చిత్రం రూ. 200 కోట్ల క్లబ్ లో చేరింది.
రూ. 200 కోట్ల క్లబ్
17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి, యానిమేటెడ్ సినిమాలలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు వచ్చిన హనుమాన్, స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్ వంటి యానిమేటెడ్ సినిమాలను కూడా అధికమించింది. భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా “మహా అవతార్ నరసింహ” నిలిచింది.
మంచి కథాంశం, అద్భుతమైన విజువల్స్, నరసింహ స్వామి భక్తి భావం సినిమా విజయానికి ప్రధాన కారణంగా మారింది. కథ, కథనం బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఈ విజయం భారతీయ యానిమేషన్ పరిశ్రమకు కొత్త దారి చూపించింది.






