నవీన్ పోలిశెట్టి కొత్త కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారి దర్శకత్వంలో ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఒక వీడియోను షేర్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుందని తెలిపారు. ‘అనగనగా ఒక రాజు’ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌లో ఏపీ మాజీ సీఎం జగన్ వాయిస్ వినిపిస్తుండటం సంచలనంగా మారింది.
ఇక ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టి నవ్వుల పండుగను తీసుకురాబోతున్నాడని అర్థమైంది. సాధారణంగా ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు ప్రేక్షకులను బాగా ఎంటర్‌ట్రైన్ చేస్తాయి. అందువల్లనే వచ్చే ఏడాది సంక్రాంతికి నవీన్ పొలిశెట్టి కచీప్ వేసేశాడు. తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి ఈ మూవీలో నవీన్ కి జోడిగా నటిస్తుంది.
ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వించే వినోదాన్ని అందించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు మారి తెరకెక్కిస్తున్నాడు. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. పండుగ రుచికి సరిపోయేలా తనదైన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయనున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.






