ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం “ఆంధ్ర కింగ్ తాలుకా”.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని మొదటి సింగిల్ “నువ్వుంటే చాలే” లిరికల్ వీడియో తాజాగా విడుదలైంది. ఈ పాటకు స్వయంగా రామ్ పోతినేని సాహిత్యం అందించడం విశేషం.
‘‘నువ్వుంటే చాలే’’ పాటను రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. వివేక్-మెర్విన్ ద్వయం ఈ పాటకు సంగీతం అందించారు. ఈ పాట విడుదలైన కొద్దిసేపట్లోనే అద్భుతమైన స్పందనను అందుకుంది. ప్రేమకు ఒక హృదయ స్పందన ఉంటే, అది కచ్చితంగా ‘నువ్వుంటే చాలే’ లాగే ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పాటలో రామ్ పోతినేని రాసిన సాహిత్యం ఎంతో హృద్యంగా, అర్థవంతంగా ఉందని, ప్రతి పంక్తి కూడా హృదయం నుండి వచ్చిన మాటలా అనిపిస్తుందని పలువురు ప్రశంసించారు.
సహజమైన అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ పాట, దృశ్యపరంగానూ అద్భుతంగా ఉంది. ఈ చిత్రం రామ్ కెరీర్‌లో మరో వినూత్న ప్రయత్నంగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
‘ఆంధ్ర కింగ్ తాలుకా’ చిత్రంలో రామ్ పోతినేని ఒక సూపర్ స్టార్ కు వీరాభిమాని ‘ఆంధ్ర కింగ్ సూర్య తాలుకా’ గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. భగ్యశ్రీ బోర్సే కథానాయిక. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సిద్ధార్థ నూని సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ తో ఈ చిత్రం ఒక దృశ్యమానంగా, భావోద్వేగభరితంగా రూపొందుతోంది. సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.






