stunt master raju: సినిమా షూటింగ్‌లో విషాదం.. గాల్లో ఎగిరిన కారు.. స్టంట్ మాస్టర్ రాజు మృతి

కోలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ ఎస్.ఎం. రాజు (మోహన్ రాజ్) పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా తెరకెక్కుతున్న “వెట్టువన్” (Vettuvam) సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆదివారం (జులై 13) నాగపట్నం సమీపంలో జరిగిన ఈ ఘటన సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

“వెట్టువన్” సినిమా కోసం అత్యంత ప్రమాదకరమైన కార్ జంప్ స్టంట్‌ను రాజు పర్యవేక్షిస్తున్నారు. ఈ స్టంట్ చేస్తున్న సమయంలో కారు అదుపుతప్పి ప్రమాదానికి దారితీసింది. తీవ్ర గాయాలపాలైన రాజును వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ దృశ్యాలు చిత్రీకరించబడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రాజు అతి వేగంగా కారు నడుపుతూ, రాంప్ మీదుగా దూకిన తర్వాత కారు గాలిలో రెండుసార్లు పల్టీలు కొట్టి తీవ్రంగా కింద పడినట్లు ఉంది. ఈ ప్రమాదంతో షూటింగ్ ప్రదేశంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

సినీ ప్రముఖుల సంతాపం:

రాజు మృతిపై తమిళ చిత్ర పరిశ్రమలోని పలువురు నటులు, సాంకేతిక నిపుణులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హీరో విశాల్ తన ట్విట్టర్ (ప్రస్తుతం X) ద్వారా ఈ విషాద వార్తను ధృవీకరించి, రాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “స్టంట్ ఆర్టిస్ట్ రాజు కారు బోల్తా పడే సన్నివేశం చేస్తూ మరణించాడనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. రాజు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. అతను నా సినిమాల్లో చాలా రిస్క్ స్టంట్లు చేశాడు. ఎందుకంటే అతను చాలా ధైర్యవంతుడు. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అతని ఆత్మకు శాంతి లభించాలని కోరుకుంటున్నాను. రాజు కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటాను” అని విశాల్ పేర్కొన్నారు.

అలాగే ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ స్టంట్ సిల్వా కూడా రాజు మరణానికి సంతాపం తెలియజేశారు. “కార్ జంపింగ్ స్టంట్స్ చేయడంలో రాజు తర్వాతే ఎవరైనా. ఆయన మరణం స్టంట్ యూనియన్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు” అని అన్నారు.

నిర్మాణ సంస్థపై విమర్శలు:

అయితే, ఈ ఘటనపై హీరో ఆర్య గానీ, దర్శకుడు పా. రంజిత్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోవడంపై కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సినిమా కోసం పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన స్టంట్ ఆర్టిస్ట్‌పై కనీసం స్పందించకపోవడం బాధాకరమని కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం