వర్షాకాలం వేడి నుంచి ఉపశమనాన్నిచ్చినా, అనేక ఆరోగ్య సమస్యలను వెంట తెస్తుంది. అధిక తేమ, నిలిచి ఉన్న నీరు, కలుషిత నీటి వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. వర్షాకాలంలో ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండటానికి పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం
వ్యక్తిగత పరిశుభ్రత
చేతులు తరచుగా కడుక్కోవాలి: ఆహారం తినే ముందు, టాయిలెట్ వాడిన తర్వాత, బయటి నుంచి వచ్చిన తర్వాత సబ్బు, నీటితో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. సబ్బు లేని చోట శానిటైజర్ వాడాలి.
శరీరాన్ని పొడిగా ఉంచుకోండి: తడి దుస్తులు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. వర్షంలో తడిస్తే వెంటనే పొడి దుస్తులు ధరించాలి. స్నానం తర్వాత శరీరాన్ని, ముఖ్యంగా చర్మపు మడతలను పూర్తిగా ఆరబెట్టుకోవాలి.
చెప్పులు ధరించండి: వర్షపు నీటిలో చెప్పులు లేకుండా నడవద్దు. వాటర్‌ప్రూఫ్ చెప్పులు ధరించండి. ఇంటికి వచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో, యాంటీసెప్టిక్ సబ్బుతో పాదాలను కడిగి పూర్తిగా ఆరబెట్టాలి.
శుభ్రమైన దుస్తులు: తడి దుస్తులు ఫంగస్ కు నిలయం కావచ్చు. పూర్తిగా ఆరబెట్టిన దుస్తులనే ధరించండి.
ఆహారం, నీటి భద్రత:
శుభ్రమైన, కాచి చల్లార్చిన నీరు తాగండి: వర్షాకాలంలో నీటి వనరులు సులభంగా కలుషితమవుతాయి. టైఫాయిడ్, కలరా, కామెర్లు వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఎప్పుడూ కాచి చల్లార్చిన లేదా శుద్ధి చేసిన నీటినే తాగాలి.
తాజాగా వండిన ఇంట్లో భోజనం: తేమతో కూడిన వాతావరణంలో ఆహారం త్వరగా పాడవుతుంది. బయటి సలాడ్‌లు, పచ్చి ఆహారాలు తినడం మానుకోండి. తాజాగా వండిన, వేడి ఆహారాన్ని ఎంచుకోండి. మిగిలిపోయిన ఆహారాన్ని పూర్తిగా వేడి చేసి తినాలి.
స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండండి: బయటి ఆహారం వర్షం, ఈగలు, ధూళికి గురై కలుషితమయ్యే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ మానుకోవడం ఉత్తమం.
పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడగాలి: పండ్లు, కూరగాయలను, ముఖ్యంగా పచ్చిగా తినేవాటిని పారే నీటి కింద బాగా కడగాలి.
నిలిచిన నీటిని తొలగించండి: దోమలు నిలిచిన నీటిలో గుడ్లు పెడతాయి. పూల కుండీలు, కూలర్‌లు, బకెట్లు, పాత టైర్లు, ఇళ్ల చుట్టూ ఉన్న కాలువల్లో నీరు నిలవకుండా చూసుకోండి.
దోమల నివారణ మందులు వాడండి: ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు దోమల నివారణ క్రీములు లేదా స్ప్రేలను ఉపయోగించండి. నిద్రపోతున్నప్పుడు దోమతెరలను వాడండి.






