Life Style: వర్షాకాలంలో పిల్లలు తరచూ జబ్బుల బారిన పడుతుంటారు. ఎక్కువగా జ్వరం, జలుబుతో బాధపడుతుంటారు. అయితే పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు పేరెంట్స్ కంగారు పడిపోయి రకరకాల ఇంటి చిట్కాలు పాటిస్తుంటారు. అయితే పిల్లలకు జ్వరం ఉన్నప్పుడు జ్వరం ఉన్నప్పుడు కొన్ని పనులు అస్సలు చేయవద్దు. ఇవి పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మందపాటి దుస్తులు
సాధారణంగా పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వారిని వెచ్చగా ఉంచడానికి మందపాటి లేదా ఉన్ని దుస్తులను వేస్తారు. కానీ, ఇలా చేయడం సరైనదని చెబుతున్నారు నిపుణులు. జ్వరంలో పిల్లవాడిని మందపాటి బట్టలతో కవర్ చేయడం ద్వారా శరీరం నుంచి వేడి బయటకు రాదు. దీని వల్ల జ్వరం తగ్గదని డాక్టర్లు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండేలా తేలికైన, సౌకర్యవంతమైన బట్టలను వేయాలి.
తడి గుడ్డ పెట్టడం
పిల్లలకు విపరీతమైన జ్వరం ఉన్నప్పుడు.. తడి గుడ్డతో తుడవడం మంచిదే. కానీ, గోరువెచ్చని నీటితో తుడవాలి డాక్టర్లు చెబుతున్నారు. మరీ చల్లటి నీటిని ఉపయోగించడం వల్ల శరీరం షాక్ కు గురవుతుంది. అందుకే గోరు వెచ్చని నీటితో తుడవాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమంగా తగ్గిస్తుంది.
బలవంతంగా తినిపించవద్దు
సాధారణంగా పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఆకలిని కోల్పోవడం, తినాలనిపించకపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో, తల్లిదండ్రులు తమ పిల్లలకు బలవంతంగా తినిపించడానికి ప్రయత్నిస్తారు. అయితే బలవంతంగా తినిపించడం వల్ల వాంతులు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. పిల్లలను హైడ్రేటెడ్ గా ఉంచడానికి సూప్, కొబ్బరి నీళ్లు, జ్యూస్ లేదా ఇతర ద్రవాలను ఇవ్వడం మంచిది.
వేడి గదిలో ఉంచకండి
పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏసీ, ఫ్యాన్, కూలర్ ఆపేసి నిద్రపుచ్చడం చేస్తుంటారు. ఇలా వేడి వాతావరణంలో ఉంచడం ద్వారా పిల్లల శరీర ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. నార్మల్ టెంపరేచర్ ఉన్న గదిలో ఉంచాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఏసీ, ఫ్యాన్ కింద నేరుగా నిద్రపుచ్చడం మంచిది కాదని గుర్తుంచుకోండి.






