Life style: వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ ఈ సీజన్‌లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా మీ వంటగదిని పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి..
పచారీ సరుకుల నిల్వ
వర్షాకాలంలో అధిక తేమ కారణంగా ఆహార పదార్థాలు త్వరగా పాడవుతుంటాయి. పురుగులు పట్టడం, బూజు రావడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. దీనిని నివారించడానికి బియ్యం, పప్పులు, గోధుమపిండి వంటి వాటిని ఎండలో బాగా ఆరబెట్టి నిల్వ చేయాలి. గాలి వెళ్లని డబ్బాలు (Airtight containers) ఉపయోగించడం వల్ల తేమ చేరకుండా ఉంటుంది.
కూరగాయలు, పండ్ల విషయంలో జాగ్రత్తలు
వర్షాకాలంలో తేమ కారణంగా కూరగాయలు, ఆకుకూరలపై క్రిములు, బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటిని శుభ్రంగా కడిగి వాడకపోతే అనారోగ్యాలు వస్తాయి. కావున కూరగాయలను వాడే ముందు వెనిగర్ లేదా ఉప్పు కలిపిన నీటిలో కాసేపు ఉంచి, ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఆ తర్వాత వాటిని పొడిగా చేసి, ఒక పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవడం వల్ల తాజాగా ఉంటాయి.
ఆహారం, నీటి పరిశుభ్రత
వర్షాకాలంలో కలుషిత నీటి వల్ల అనేక వ్యాధులు వస్తాయి. అందుకే ఈ సీజన్‌లో తినే ఆహారం, తాగే నీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. నీటిని మరిగించి తాగడం శ్రేయస్కరం. ఇది నీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారిస్తుంది. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని ఎక్కువసేపు ఉంచకుండా, ఎప్పటికప్పుడు తాజాగా వండుకుని తినడం మంచిది.
వంటగది
వంటగదిలో తేమ, తడి కారణంగా దోమలు, ఈగలు, బొద్దింకలు వంటివి పెరుగుతాయి. ఇవి అనారోగ్యాన్ని కలిగించే క్రిములను మోసుకొస్తాయి. కావున వంటగదిని ఎప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. కిచెన్ కౌంటర్లు, అల్మారాలను క్రిమిసంహారక మందులతో లేదా బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేయాలి.






