Raksha Bandhan 2025: హిందూ సంప్రదాయాలలో రాఖీ పండగకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అన్నా చెల్లెల్లు, అక్కాదమ్ముల అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది రాఖీ పండగ ఆగస్టు 9న జరుపుకోనున్నారు. తోబుట్టువులు తమ సోదరులకు రాఖీ కట్టి.. వారి ఆశీసులను తీసుకుంటారు. అక్కాచెల్లెలు కట్టిన రక్షాబంధనానికి ప్రతిగా సోదరుడు వారికి జీవితాంతం రక్షగా, తోడుగా ఉంటానని హామీ ఇస్తాడు. అలాగే ప్రేమతో తమ తోబుట్టువులకు బహుమతులను కూడా ప్రజెంట్ చేస్తాడు.
అయితే ఈ రాఖీ పండగను జరుపుకోవడం వెనుక పురాణ కథలు, నమ్మకాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
శ్రీకృష్ణుడు – ద్రౌపది కథ
పురాణాల ప్రకారం.. మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని తన సుదర్శన చక్రంతో సంహరిస్తాడు. ఆ సమయంలో కృష్ణుడి వేలికి గాయమై రక్తం కారడం మొదలవుతుంది. అది చూసిన ద్రౌపది తట్టుకోలేపోతుంది. వెంటనే తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుడి వేలికి కట్టు కట్టింది. ఆమె చేసిన పనికి సంతోషించిన శ్రీకృష్ణుడు.. ఎల్లవేళలా ద్రౌపదికి రక్షగా తోడుగా ఉంటానని హామీ ఇస్తాడు. అలా ఆరోజు ద్రౌపది కట్టిన కట్టు.. నేడు రక్షాబంధన్ గా జరుపుకుంటున్నారు. శ్రీకృష్ణుడు ఇచ్చిన మాటప్రకారం దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపహరణం చేసినప్పుడు ఆమె మానాన్ని కాపాడి తనకు రక్షగా, అండగా నిలిచాడు.
దేవేంద్రుడు – శచీదేవి కథ
పూర్వం ఒకసారి దేవతలకు, రాక్షసులకు మధ్య భీకరమైన యుద్ధం జరిగిందట. ఆ యుద్ధంలో దేవేంద్రుడు ఓడిపోయి.. నిస్సహకుడిగా మిగిలిపోతాడు. అప్పుడు దేవేంద్రుడి భార్య శచీదేవి తన భర్తను కాపాడమని శ్రీమహావిష్ణువును వేడుకోగా.. విష్ణువు ఆమెకు సలహా ఇస్తారు. మహావిష్ణువు సలహా మేరకు భర్త చేతికి ఒక పవిత్రమైన దారాన్ని కట్టి రాక్షసులతో యుద్దానికి పంపుతుంది. ఆ ఆ రక్షాబంధనం ప్రభావంతో ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి తన అధికారాన్ని పొందుతాడు. అప్పటి నుంచి సోదరులకు, ప్రేమించినవారికి రక్షగా ఈ రాఖీని కట్టే సంప్రదాయం మొదలైందని చెబుతారు.
శ్రీమహాలక్ష్మి – బలి చక్రవర్తి
బలి చక్రవర్తి గొప్ప విష్ణు భక్తుడు. ఒకసారి బలి చక్రవర్తి విష్ణువును తనతో పాటు పాతాళ లోకంలో ఉండమని కోరతాడు. దీనితో వైకుంఠంలో విష్ణువు లేకపోవడంతో లక్ష్మీదేవి బాధపడుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఒక పేద స్త్రీ రూపంలో బలి చక్రవర్తి దగ్గరకు వెళ్లి, అతనికి రాఖీ కడుతుంది. బలి చక్రవర్తి ఆమెకు ఏం కావాలో కోరుకోమన్నప్పుడు, లక్ష్మీదేవి తన నిజ రూపాన్ని చూపించి, తన భర్త శ్రీమహావిష్ణువును తిరిగి తనతో పంపించమని కోరుతుంది. బలి చక్రవర్తి ఇచ్చిన మాట ప్రకారం విష్ణువును ఆమెతో పంపిస్తాడు.
అలెగ్జాండర్ భార్య – పురుషోత్తముడు
ఇది పురాణ కథ కాకపోయినా, చరిత్రలో ప్రచారంలో ఉన్న ఒక కథ. ఒకసారి అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తినప్పుడు, అతని భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నగా భావించి రాఖీ కడుతుంది. తన భర్తను చంపవద్దని వేడుకుంటుంది. యుద్ధంలో పురుషోత్తముడు అలెగ్జాండర్‌ను ఓడించినా, రాఖీ బంధాన్ని గౌరవించి అతన్ని చంపకుండా విడిచిపెడతాడు.






