తత్కాల్ టికెట్ గురించి మీ అందరికీ తెలిసిందే. అయితే, దాన్ని బుక్ చేసుకోవడం అంత ఈజీ కాదనే విషయం కూడా మీకు తెలుసు. అడ్వాన్సు బుకింగ్స్ వల్ల కొన్ని సార్లు మనకు బెర్త్స్ లేదా సీట్స్ దొరకవు. దాని వల్ల అత్యవసర ప్రయాణాలు పెట్టుకొనేవారు చాలా ఇబ్బంది పడతారు. వారి సౌలభ్యం కోసమే ప్రభుత్వం తత్కాల్ టికెట్లను ప్రవేశపెట్టింది. దీనితో ఒక రోజు ముందుగానే.. తర్వాతి రోజు ప్రయాణానికి టికెట్లు తీసుకోవచ్చు. అయితే, ఈ తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి, రద్దు చేయడానికి నిర్దిష్ట నియమాలు.. సమయాలు ఉన్నాయి. కాబట్టి, మీరు తత్కాల్ టికెట్ బుక్ చేసుకొనే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి.
తత్కాల్ టిక్కెట్ బుకింగ్ సమయాలు:
ఒకప్పుడు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకొవడానికి ఒక సమయం మాత్రమే ఉండేది. అయితే, ఇప్పుడు స్లీపర్ క్లాస్‌కు వేరుగా, ఏసీ క్లాస్‌లకు వేరేగా తత్కాల్ టైమింగ్స్ నిర్ధరించారు. కాబట్టి మీరు ఏ క్లాస్‌లో ప్రయాణించుకోవాలని అనుకుంటున్నారనేది ముందుగా తెలుసుకోవాలి.
AC తరగతులకు (1st AC, 2nd AC, 3rd AC)
AC తరగతులకు తత్కాల్ బుకింగ్ ప్రయాణ తేదీకి ముందు రోజు ఉదయం 10 గంటలకు తెరవబడుతుంది. రిజర్వేషన్ కౌంటర్లు, ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్స్ ద్వారా ఈ టైమ్‌కు కచ్చితంగా లాగిన్ అయితేనే ఆ టికెట్లు లభిస్తాయి. ఉదాహరణకు మీరు శనివారం విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలని అనుకుంటే.. శుక్రవారం ఉదయం 10 గంటలకే ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌లో లాగిన్ అవ్వాలి. అయితే, ఏ ట్రైన్‌కు.. ఎన్ని గంటలకు ప్రయాణించాలనేది కూడా మీరు ముందుగా నిర్ణయించుకుంటే వేగంగా టికెట్లను బుక్ చేసుకోవడం సాధ్యమవుతుంది. కేవలం 10 సెకన్ల లోపే బుకింగ్స్ అయిపోతాయి. కాబట్టి మీరు చాలా వేగంగా టికెట్ బుక్ చేసుకోవాలి.
స్లీపర్ టికెట్ కావాలంటే..:
స్లీపర్ క్లాస్ టికెట్ కావాలంటే మీరు ప్రయాణానికి ముందు రోజు ఉదయం 11 గంటలకు లాగిన్ అవ్వాలి. లేదా ఆ టైమ్ కల్లా రిజర్వేషన్ కౌంటర్‌లో ఉండాలి. అదే రోజు 10 గంటలకు ఏసీ టికెట్లు పొందలేకపోయినవారికి ఇది మంచి ఆప్షన్. ఇది కూడా మిస్ అయితే.. ఇక ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే బెటర్.
తత్కాల్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం ఎలా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
తత్కాల్ టిక్కెట్లు చివరి నిమిషంలో బుకింగ్‌ల కోసం ప్రభుత్వం కల్పించిన ఒక ఆప్షన్. అందుకే, దాని నిబంధనలు కూడా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సిలేషన్ విషయంలో ఈ రూల్స్ కాస్త కఠినంగా ఉంటాయి. తత్కాల్ టిక్కెట్‌లు ఒక్కసారి కన్ఫార్మ్ అయిపోయిన తర్వాత మళ్లీ రద్దు చేసుకోవడానికి అవకాశం ఉండదు. కేవలం వెయిట్‌లిస్ట్ చేసిన టిక్కెట్‌లకు మాత్రమే ఆ ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా తత్కాల్ టికెట్లను రద్దు చేసుకోవచ్చు. అవేంటో చూడండి.
కన్ఫార్మ్ టికెట్‌కు క్యాన్సల్ కష్టమే: ఒకసారి తత్కాల్ టిక్కెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత క్యాన్సల్ కాదు. రైలు రద్దులేదా బాగా ఆలస్యం ఇతరాత్ర అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ విషయంలో వెసులుబాటు ఉంటుంది. కానీ, అది చాలా అరుదు. ఒక వేళ మీరు టికెట్‌ను రద్దు చేసినట్లయితే మీకు పైసా కూడా తిరిగి రాదు.
వెయిట్‌లిస్ట్ చేసిన తత్కాల్ టిక్కెట్‌లు
వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్లకు మాత్రం పూర్తి రిఫండ్ చెల్లిస్తారు. చార్ట్ తయారీకి ముందే దాన్ని రద్దు చేస్తే (సాధారణంగా రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు చార్ట్ ప్రిపేర్ అవుతుంది) పూర్తి రీఫండ్‌ను అందుకుంటారు. మీరు రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు టిక్కెట్‌ను రద్దు చేస్తే, ఒక్కో ప్రయాణికుడికి ₹60 + GST క్యాన్సిలేషన్ ఛార్జీలు విధిస్తారు. కాబట్టి, రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు వరకు పెనాల్టీ లేకుండా వెయిట్‌లిస్ట్ చేసిన టిక్కెట్‌ను రద్దు చెయ్యాలి. చివరి నిమిషం వరకు వేచి చూడవద్దు.
పాక్షికంగా ధృవీకరించబడిన తత్కాల్ టిక్కెట్లు
ఒకరి కంటే ఎక్కువ మంది తత్కాల్ టికెట్లు తీసుకున్నట్లయితే.. వారిలో కొందరికి మాత్రమే కన్ఫార్మ్ దొరికి, మిగతావారివి వెయింటింగ్ వచ్చినట్లయితే.. పాక్షిక రద్దుకు అవకాశం ఉంటుంది. అంటే.. అందులో వెయిట్ లిస్ట్ వచ్చిన ప్రయాణికుల టికెట్లను రద్దు చేసుకుంటే రిఫండ్ లభిస్తుంది. వెయిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు పూర్తిగా రీఫండ్ చేయబడుతుంది. ఉదాహరణకు, ఇద్దరు ప్రయాణీకులు టికెట్ కన్ఫార్మ్ అయ్యి.. ఒకరు వెయిట్‌లిస్ట్‌లో ఉన్నట్లయితే, టిక్కెట్‌లను రద్దు చేయవచ్చు, వెయిట్‌లిస్ట్ చేసిన దానికి వర్తించే క్యాన్సలేషన్ ఛార్జీలను మినహాయించి రిఫండ్ పొందవచ్చు.
ప్రీమియం తత్కాల్ టిక్కెట్ రూల్స్ ఇందుకు భిన్నం
ఇటీవల తత్కాల్‌తోపాటు ప్రీమియం తత్కాల్ టికెట్లు కూడా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ టికెట్ ధరలు దాదాపు విమానం టికెట్ల రేట్లతో సమానంగా ఉంటాయి. అందుకే, దీని రిఫండ్ విషయంలో కొన్ని నిబంధనలు పెట్టింది. దీని క్యాన్సిలేషన్ కేవలం ప్రత్యేక సందర్భాల్లోనే వర్తిస్తుంది. ప్రయాణికుడు వెళ్లాల్సిన స్టేషన్‌కు రైలు వెళ్లకపోయినా.. అంటే రైలు మళ్లింపు వల్ల అసౌకర్యానికి గురైతే రిఫండ్ ఇస్తారు. అలాగే మీరు రిజర్వు చేసుకున్న సీటు అందుబాటులో లేకపోయినా రిఫండ్ వస్తుంది.
రైలు రద్దు లేదా ఆలస్యం
మీరు ప్రయాణించాల్సిన రైలు పూర్తిగా రద్దయినట్లయితే.. రైల్వే నుంచి మీకు ఫుల్ రిఫండ్ లభిస్తుంది. మీ రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే, మీరు మీ తత్కాల్ టికెట్ రద్దు చేసుకుని పూర్తిగా రిఫండ్ పొందవచ్చు. IRCTC పోర్టల్ ద్వారా లేదా రైల్వే కౌంటర్‌లో ఆన్‌లైన్‌లో రిఫండ్ కోసం క్లయిమ్ చేసుకోవాలి.






