కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకూ దేశంలో కోవిడ్ కేసులు పదుల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వందల సంఖ్యలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంద్రప్రదేశ్, తెలంగాణలో ప్రతిరోజు కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గత మూడు వారాల్లో ఏపీలో 38 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు కొత్త వేరియంట్ ఏదీ కనిపించలేదని అన్నారు.
దీంతో అధికారులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. కరోనా బాధితులు ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉండాలని చెబుతున్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్ తగినంతగా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కోవిడ్ పరిస్థితి అదుపులో ఉందని.. దానిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని ఎం.టి. కృష్ణబాబు అన్నారు. గత మూడు వారాల్లో సుమారు 38 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.
కొత్త వేరియంట్ల కోసం అన్ని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తున్నామని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కొత్త వేరియంట్ కనిపించలేదన్నారు. ఏవైనా ఇతర ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అయినవారే తప్ప, చాలా మంది పేషెంట్లు చికిత్సతో ఇంటి వద్దే కోలుకుంటున్నారని తెలిపారు. నేటి నుంచి రోజుకు 500 మందికి పరీక్షలను పెంచామని అన్నారు. ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని సదుపాయాలను హాస్పిటల్స్‌లలో సిద్ధంగా ఉన్నాయి అని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 3,961 కేసులు
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కూడా కేసులు పెరిగిపోతున్నాయి. జూన్ 2న ఉదయం 8 గంటల నాటికి భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 3,961గా ఉందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఈ ఏడాది ప్రారంభం నుంచి అంటే జనవరి నుంచి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల సంఖ్య 32కి పెరిగిందని తెలిపింది. ఆదివారం నుండి కేసుల సంఖ్యకు 203 కొత్త కేసులు చేరాయి. ఢిల్లీలో 47 కరోనా కేసులు అదనంగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 483కి పెరిగింది. కేరళలో 1,435 కేసులు ఉన్నాయి.






