mithun reddy: మద్యం కుంభకోణం.. YCP ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు శనివారం ఏడు గంటలపాటు విచారించిన అనంతరం మిథున్ రెడ్డిని అరెస్టు చేయగా, ఆదివారం వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి ఏ-4 నిందితుడిగా ఉన్నారు. సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో పలు సంచలన విషయాలను పొందుపరిచారు. బహుళజాతి కంపెనీల బ్రాండ్లను పక్కకు తప్పించి, సొంత లోకల్ బ్రాండ్లను తయారు చేయించి కొనుగోలు చేశారని సిట్ ఆరోపించింది. డిస్టిలరీల నుంచి మద్యం తీసుకునేందుకు ఆర్డర్ ఆఫ్ సప్లైను కూడా మ్యానువల్‌గా చేశారని, ఇందులోనూ మోసం జరిగిందని వివరించింది. గతంలో ఉన్న విధానాన్ని మార్చి ఆర్డర్ ఆఫ్ సప్లైను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారని, అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ కూడా దీన్ని ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపి ఆమోదించారని సిట్ తన నివేదికలో పేర్కొంది.

మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. ఐపీసీ సెక్షన్లు 409 (విశ్వాస భంగం), 420 (మోసం), 120(బీ) (నేరపూరిత కుట్ర)తో పాటు 34, 37 సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, 8, 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సిట్ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మిథున్ రెడ్డి వ్యక్తిగతంగా రూ.27 కోట్ల డబ్బును పర్యవేక్షించారని, ఈ నిధులను షెల్ కంపెనీలు, హవాలా మార్గాల ద్వారా మళ్లించారని సిట్ ఆరోపించింది. ఈ డబ్బులో రూ.15 కోట్లు మిథున్ రెడ్డి కుటుంబంతో సంబంధం ఉన్న PLR ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ అయ్యాయని సిట్ పేర్కొంది. ఈ లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, ఆర్థిక పత్రాలు, ఇతర డిజిటల్ ఆధారాలు ఉన్నాయని తెలిపింది.

కాగా, ఈ అరెస్టుపై వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, వైసీపీ నాయకులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, సిట్ మాత్రం ఈ కేసులో పటిష్టమైన ఆధారాలు సేకరించినట్లు చెబుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేసిన సిట్, మొత్తం 40 మంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. ఈ కుంభకోణం వల్ల రాష్ట్ర ఖజానాకు సుమారు రూ. 3,200 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం