ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. ‘తల్లికి వందనం’ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించాలని గతంలో తెలిపింది. తాజాగా ఈ పథకంపై అదిరిపోయే అప్డేట్ అందించింది. ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 పొందాలంటే.. ఏం చేయాలో వివరించింది. ముఖ్యంగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్ నెంబర్‌తో పాటు ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాలని సూచించింది. ఇదంతా జూన్ 5 లోపు జరిగిపోవాలని తెలిపింది. ఈ విధంగా లింక్ చేసుకోవడం వల్ల విద్యార్థుల తల్లుల ఖాతాలో అమౌంట్ జమ చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవని అధికారులు చెబుతున్నారు.
లింకింగ్ ప్రాసెస్‌ను ఎలా పూర్తి చేసుకోవాలో తెలుసుకోవాలంటే.. పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు. ఇదంతా జూన్ 5లోపే జరిగిపోవాలని ప్రజలకు స్పష్టం చేస్తున్నారు. కాగా ఈ స్కీమ్ కింద ఫస్ట్ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15000 డబ్బులు జమ చేస్తారు. ఇలా ప్రతి ఏడాది 15,000 ఇవ్వనున్నారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో చదువుతుండాలి. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్‌మీడియట్ వరకు చదివిన వారు అర్హులు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. కనీసం 75 శాతం హాజరు ఉంటేనే డబ్బులు అకౌంట్లో జమవుతాయి.
ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే విద్యార్థి స్టడీ సర్టిఫికెట్ ఉండాలి. పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్, తల్లి ఆధార్ కార్డు, తల్లి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్.. నివాస పత్రము లేదా రేషన్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణపత్రం, కుల ధ్రువీకరణ పత్రము ఉండాలి. సర్కార్ త్వరలోనే అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించి డబ్బులు జమ చేయనుంది.






