Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. రానా, విజయ్, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మికి ED నోటీసులు!

బెట్టింగ్ యాప్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండలకు ఈడీ నోటీసులు అందాయి.

విచారణ తేదీలు:

రానా దగ్గుబాటి: జూలై 23న విచారణకు హాజరు కావాలని ఈడీ సూచించింది.

ప్రకాష్ రాజ్: జూలై 30న హాజరుకావాలి.

విజయ్ దేవరకొండ: ఆగస్టు 6న విచారణకు రావాలని కోరింది.

మంచు లక్ష్మి: ఆగస్టు 13న హాజరుకావాలి.

ఈ నలుగురు సినీ ప్రముఖులు అక్రమ బెట్టింగ్ యాప్‌లను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈడీ ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నమోదైన కనీసం ఐదు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది.

ఈ కేసులో ఈడీ 29 మంది సెలబ్రిటీలు, యూట్యూబర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కేసు నమోదు చేసింది. ఈ ప్రముఖులు జంగ్లీ రమ్మీ, జీట్‌విన్, లోటస్365 వంటి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి, ప్రమోషనల్ ఫీజులు అందుకున్నారని ఈడీ అనుమానిస్తోంది. ఈ బెట్టింగ్ యాప్‌లు అక్రమ కార్యకలాపాల ద్వారా కోట్లాది రూపాయల నిధులను సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

గతంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో కొంతమంది సినీ ప్రముఖులపై కేసులు నమోదు చేశారు. అయితే, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ తమ లీగల్ టీమ్‌లు అనుమతించిన చట్టబద్ధమైన స్కిల్ ఆధారిత గేమ్స్‌ను మాత్రమే ప్రమోట్ చేశామని, 2017 లోనే తమ కాంట్రాక్టులు ముగిశాయని స్పష్టం చేశారు. ప్రకాష్ రాజ్ కూడా 2017 లో ఒక యాప్‌ను ప్రమోట్ చేయకుండానే కాంట్రాక్టును పునరుద్ధరించలేదని తెలిపారు. ఈ కేసు విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో వేచి చూడాలి.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం