దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు 174 కంటే ఎక్కువ మంది ప్రయాణికులతో బయలుదేరిన ఫ్లైదుబాయ్ (Flydubai) ఎఫ్‌జడ్ 1073 (FZ1073) విమానంలో మిడ్-ఎయిర్‌లో తీవ్ర భయాందోళనకరమైన ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా కాక్‌పిట్ లోపల ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్, విమాన కెప్టెన్, భారతీయ పౌరుడైన స్మిత్ మచ్ఛార్‌పై చాకుతో దాడి చేసి, విమానాన్ని కూల్చివేసేందుకు యత్నించాడని ఇజ్రాయెల్ వర్గాలు, నివేదికలు తెలిపాయి.
తీవ్రంగా గాయపడినప్పటికీ, కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ అత్యంత ధైర్యంతో కో-పైలట్ యత్నాన్ని తిప్పికొట్టారు. అదే సమయంలో విమాన సిబ్బంది, ఇతర పైలట్లు, ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి ప్రవేశించి దాడికి పాల్పడిన కో-పైలట్‌ను లొంగదీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఫ్లైదుబాయ్ యాజమాన్యం ధృవీకరించింది.
విమానంలో అసలు ఏం జరిగింది?
బోయింగ్ 737 మ్యాక్స్ 8 (Boeing 737 MAX 8) రకానికి చెందిన ఈ విమానం దుబాయ్ నుంచి బయలుదేరి జోర్డాన్ సరిహద్దుల సమీపానికి చేరుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విమానం సాధారణ ప్రయాణంలో ఉండగా ఉన్నట్టుండి కాక్‌పిట్ నుంచి అరుపులు వినబడ్డాయని, విమానం వేగంగా కిందకు దిగడం ప్రారంభించిందని ప్రయాణికులు తెలిపారు.
ఈ ఘర్షణ సమయంలో కో-పైలట్ విమానాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై కో-పైలట్ పాకెట్ నైఫ్‌తో దాడి చేయడంతో ఆయన ముఖం, చేతులపై రక్తగాయాలయ్యాయి. గాయపడినప్పటికీ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ విమానంపై నియంత్రణ కోల్పోకుండా నిరోధించేందుకు పోరాడారు.
హీరో కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ ఎవరు?
విమానాన్ని, ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ గుజరాత్ మూలాలు కలిగిన భారతీయ పౌరుడు. ఆయనకు విమానయాన రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది.
స్మిత్ మచ్ఛార్ బోయింగ్ 737 విమానాలను నడపడంలో 13 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు. ఆయన ఇప్పటివరకు 9,750 గంటలకుపైగా విమానాలను నడిపిన అనుభవం సంపాదించారు. ఫ్లైదుబాయ్‌లో చేరడానికి ముందు ఆయన భారత్‌కు చెందిన స్పైస్‌జెట్ (SpiceJet) సంస్థలో జూన్ 2011 నుంచి 2022 వరకు దాదాపు 11 ఏళ్ల పాటు కమాండర్‌గా, లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా వివిధ బాధ్యతల్లో సేవలందించారు.
జూన్ 2022లో ఆయన డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్‌గా ఫ్లైదుబాయ్ సంస్థలో చేరారు. ఆయన వెలింగ్‌కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ పొందారు.
గాయపడిన స్థితిలో కూడా విమానాన్ని కాపాడిన ఆయన సమయస్ఫూర్తిని, ధైర్యసాహసాలను విమానంలోని ప్రయాణికులు, అధికారులు ప్రశంసించారు.
విమానం ఆల్టిట్యూడ్ పతనం -ఎమర్జెన్సీ కోడ్‌ల కలకలం
ఫ్లైట్‌ట్రాకర్ డేటా (Flightradar24) ప్రకారం, కాక్‌పిట్‌లో ఘర్షణ జరుగుతున్న సమయంలో విమానం తీవ్ర పరిణామాలకు గురైంది. 34,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే దాదాపు 14,000 నుంచి 17,400 అడుగుల ఎత్తుకు ఒక్కసారిగా పడిపోయింది.
తొలుత ప్రసారమైన కోడ్ 7700 (సాధారణ అత్యవసర పరిస్థితి )తెలియజేస్తుంది. కొద్దిసేపటికే కోడ్ 7500కు మారింది. 7500 కోడ్ అనేది విమాన హైజాకింగ్ లేదా అక్రమ జోక్యంను సూచించే అంతర్జాతీయ అత్యవసర సంకేతం. ఆ తర్వాత విమానం తిరిగి 7700 కోడ్‌ను ప్రసారం చేస్తూ సౌదీ అరేబియా వైపు మళ్లింది.
విమానం నుంచి 7500 హైజాక్ సంకేతం రావడంతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు అప్రమత్తమై, వెంటనే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను గాల్లోకి పంపాయి.
ప్రయాణికులు, సిబ్బంది చాకచక్యం – కో-పైలట్ బంధనం
విమానం ఊగిసలాడుతూ వేగంగా కిందకు పడిపోతుండటంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. కాక్‌పిట్‌లో రక్తం కనిపించడం, కెప్టెన్ గాయపడటంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది, విమానంలో ప్రయాణిస్తున్న ఇతర పైలట్లు కలిసి కాక్‌పిట్ తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించారు.
విధ్వంసానికి యత్నిస్తున్న కో-పైలట్‌ను ప్రయాణికులు, సిబ్బంది బలవంతంగా అదుపులోకి తీసుకుని బంధించారు. అనంతరం విమానంలో ఉన్న మరో సిబ్బంది/పైలట్ సహాయంతో విమానాన్ని స్థిరీకరించి సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి సురక్షితంగా తీసుకెళ్లారు.
ఇజ్రాయెల్, సౌదీ అరేబియా స్పందనలు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ, విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడిన వీరులకు నమస్కరిస్తున్నానని, వారు పెద్ద ప్రమాదాన్ని తదనుగుణంగా అడ్డుకున్నారని తెలిపారు. ఈ ఘటనపై సౌదీ అరేబియా అధికారులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని చెప్పారు.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఈ ఘటనను ఉగ్రవాద దాడి యత్నంగా అభివర్ణించారు.
సౌదీ అరేబియాలోని క్లస్టర్2 ఆవియేషన్ ఆపరేటర్ ప్రకారం, విమానం అత్యవసర ల్యాండింగ్ కోసం అభ్యర్థించగానే తబుక్ విమానాశ్రయం ఎమర్జెన్సీ ప్రకటించి ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేసింది. ల్యాండ్ అయిన వెంటనే గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛార్, కో-పైలట్‌లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఫ్లైదుబాయ్ యాజమాన్యం కాక్‌పిట్‌లో ఘర్షణ జరిగిందని ధృవీకరిస్తూనే, ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు, ఉద్దేశాలపై అధికారిక దర్యాప్తు జరుగుతోందని, ముందస్తు అంచనాలకు రాకూడదని విజ్ఞప్తి చేసింది.
సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన ప్రయాణికులను టెల్ అవీవ్ తరలించేందుకు ఫ్లైదుబాయ్ సంస్థ మరొక ప్రత్యామ్నాయ విమానాన్ని తబుక్ విమానాశ్రయానికి పంపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చింది.
వైసీపీ నాయకత్వంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు