రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచికొడుతోంది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. నేడు (సోమవారం), రేపు (మంగళవారం) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నేడు వర్షాలు కురిసే జిల్లాలు (ఆరెంజ్/ఎల్లో అలర్ట్):
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,
మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్,
రేపు అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలు (ఆరెంజ్ అలర్ట్):
ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్,
ఇతర జిల్లాలకు:
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ముఖ్యమైన సూచనలు:
వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల నివాసితులు, నదులు, ప్రాజెక్టుల తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి. విద్యుత్ తీగలు, స్తంభాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఈ నెల 24 వరకు రాష్ట్రంలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో కూడా నేడు సాయంత్రం లేదా రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.






