ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు దాటుతోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మూడు పార్టీలో ఒకటిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా చాలా పుకార్లు షికారు చేస్తున్నాయి. కూటమి పార్టీల్లో లుకలుకలు ప్రారంభమయ్యాయని అంటున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు టీడీపీకి పడటం లేదని టాగ్ గట్టిగా వినిపిస్తోంది. అందుకు తగట్టుగానే ప్రభుత్వ కార్యక్రమాల్లో జనసేనానీ యాక్టివ్‌గా పాల్గొనడం లేదు. అప్పట్లో ఓసారి కేబినెట్ భేటీకి కూడా రాకపోవడం చర్చనీయాంశమైంది. ఆరోగ్యం బాగాలేదని అందుకే రాలేదని జనసేన వర్గాలు చెప్పుకొచ్చాయి. తర్వాత ఆరోగ్యం బాగాలేదని చెప్పిన పవన్ కల్యాణ్ తమిళనాడులోని ఆలయాల సందర్శనకు వెళ్లారు. తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు, లోకేష్‌తో కలిసి పవన్ పాల్గొనడంతో అప్పటి వరకు నడుస్తున్న పుకార్లకు తాళం పడింది.
బాంబులు పేల్చిన పవన్, నాగబాబు
పిఠాపురంలో చాలా గ్రాండ్‌లో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. జయకేతనం పేరుతో నిర్వహించిన ఈ సభలో పవన్ కల్యాణ్, నాగబాబు చేసిన కామెంట్స్ చాలా వైరల్ అవుతున్నాయి.ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమస్యలు ఎదురొచ్చిన దశాబ్ధకాలంగా నిలబడ్డామన్నారు. అక్కడితో ఆగిపోయి ఉంటే ఇదో పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. కానీ ఆ తర్వాత చేసిన కామెంట్ పెను దుమారాన్నే రేపింది. నాలుగు దశాబ్ధాల టీడీపీని కూడా నిలబెట్టామని అన్నారు.ఇదే ప్రకంపనలు సృష్టిస్తోంది.
లోలోపలే రగిలిపోతున్న టీడీపీ
నాలుగు దశాబ్ధాల టీడీపీని నిలబెట్టామని పవన్ చేసిన కామెంట్‌పై టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. అప్పట్లో టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్యచౌదరి చెసిన కామెంట్స్‌ను టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. క్వింటా కోసం గుప్పెడు వడ్లు అవసరం అయితే ఆ గుప్పెడు వడ్లుదే గొప్ప అనుకుంటే ఎలా అని ఆశ్చర్య వ్యక్తం చేశారు. అటు నుంచి ఎంత సాయం వచ్చిందో ఇటు నుంచి అంతకంటే ఎక్కువే సాయం వచ్చిందని అంటున్నారు. అందుకే ఇది ఉమ్మడి కృషిగానే భావించాలి తప్ప ఏదో ఒకరిద్దరు కలిసినంత మాత్రాన పార్టీ నిలబడిందని చెప్పడం సరైన పద్ధతి కాదని విమర్శిస్తున్నారు.
సోషల్ మీడియాలో నేరుగానే విమర్శలు
బహిరంగంగా పవన్ కామెంట్స్‌పై ఎవరూ స్పందించకపోయినా టీడీపీ సానుభూతిపరులు మాత్రం సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ఎన్నికల టైంలో టీడీపీ నేతల చేసిన ఫైటింగ్ వీడియోలు పోస్టు చేసి వీళ్ల వల్లే టీడీపీ నిలబడిందని అంటున్నారు. కార్యకర్తలే టీడీపీ ఎక్కడైనా బలమని అంటున్నారు. అది ప్రతి ఎన్నికల్లో రుజువు అయిందని అంటున్నారు. టీడీపీ నేతలు సైలెంట్‌గా ఉన్నారేమో కానీ టీడీపీ కార్యకర్తలు ఎప్పుడూ పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారని గుర్తు చేస్తున్నారు.
నాగబాబు ఖర్మ కామెంట్స్
పవన్ వ్యాఖ్యలు ఇలా ఉంటే కొత్తగా ఎమ్మెల్సీ ఎన్నికైన నాగబాబు చేసిన కామెంట్స్ కూడా మరింత ఆగ్రహం తెప్పించాయి. పిఠాపురంలో పవన్ విజయానికి రెండు ఫ్యాక్టర్లే కారణమని ఒకటి పవన్ అయితే.. రెండోది స్థానికంగా ఉన్న జనసేన కార్యకర్తలని నాగబాబు అన్నారు. అంతే తప్ప పవన్ విజయంలో ఇంకా ఎవరైనా ఉన్నామని అనుకుంటే అది వాళ్ల ఖర్మ అని అన్నారు. తన సీటు త్యాగం చేసి పవన్ విజయం కోసం ఇంటింటికీ తిరిగిన వర్మనే టార్గెట్ చేస్తూ నాగబాబు ఈ కామెంట్ చేశారు. దీనిపై వర్మ అభిమానులతోపాటు తెలుగుదేశం కార్యకర్తలు మండిపడుతున్నారు.
వైసీపీ ఓటమికి ఓ కారణం సజ్జల
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సలహదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి కామెంట్స్ చేస్తూ ప్రజల్లో ఆగ్రహం తెప్పించే వాళ్లు. ఉద్యోగాలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారిని వైసీపీకి వ్యతిరేకంగా ఏకం చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్లు మా ఓటర్లు కాదని మరో కామెంట్ చేసి వారిని కూడా వైసీపీకి దూరం చేశారు. ఇలా సకలశాఖల మంత్రిగా పేరు తెచ్చుకొని ఏ శాఖపై మాట్లాడాలన్నా ఆయన వచ్చి ఏదో ఒక మాట అనేసి వ్యతిరేకతను పెంచి పోషించారు. చివరకు వైసీపీ నేతల్లో కూడా పార్టీపై వ్యతిరేక భావం క్రియేట్ చేశారు.
సజ్జల చేసిన పనులు కారణంగానే వైసీపీపై వ్యతిరేకతకు కారణమని ఆ పార్టీ నేతలే పదే పదే చెబుతూ వచ్చారు. మొన్నటికి మొన్న విజయసాయి రెడ్డికి కూడా తనను జగన్ కు దూరం చేసింది వీళ్లే అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు. 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం సజ్జలే అనే మాట గట్టిగానే వినిపించింది.
సజ్జలను చూసి నేర్చుకున్న నాగబాబు
వైసీపీలో సజ్జల తీసుకున్న పాత్రను జనసేనలో నాగబాబుకు ఇచ్చారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అప్పట్లో ఆయన చేసినట్టుగానే వెటకారంతో కూడిన కామెంట్స్ చేస్తూ కూటమి విచ్ఛిన్నానికి ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి నాగబాబు కారణమవుతున్నారని ఆరోపిస్తున్నారు. నాగబాబును కట్టడి చేయకపోతే కూటమి ఏడాదిన్నరలోనే విచ్ఛిన్నమవుతుందనే టాక్ బలంగా ఉంది. ఇప్పటికి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారని… రేపు మంత్రిగా ప్రమాణం చేస్తే తట్టుకోలేమేమో అంటున్నారు టీడీపీ శ్రేణులు.