అడవిని కబళిస్తున్న ‘అందమైన’ శత్రువు.. అడవులకు ‘క్యాన్సర్’లా మారిన తలంబ్రాల పూల మొక్క గండం!

Lantana Camara

భారతీయ అడవులు నేడు ఒక అదృశ్య యుద్ధాన్ని ఎదుర్కొంటున్నాయి. బయటి దేశాల నుంచి వచ్చిన శత్రువుల దాడుల వల్ల మన దేశ జీవవైవిధ్యం కుప్పకూలుతోంది. అయితే, ఈ దాడి చేసేది ఏ క్షిపణులో లేక అణుబాంబులో కాదు.. కేవలం అందంగా కనిపించే ఒక చిన్న రంగురంగుల పువ్వు. చూడటానికి ఎంతో అందంగా ఉండి, తోటలకు అలంకరణగా భావించే తలంబ్రాల పూల మొక్క(Lantana Camara) నేడు మన అడవులకు పట్టిన పెద్ద చీడగా మారింది. దీనిని స్థానికంగా ‘పుటుష్’ లేదా ‘గుఫూల్”తలంబ్రాల మొక్క’ ‘అక్షింతాల పూల మొక్క”నక్షత్రాల పువ్వులు’ అని కూడా పిలుస్తుంటారు. ఈ మొక్క మన అడవుల సహజత్వాన్ని నాశనం చేస్తూ, వన్యప్రాణుల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది.

బ్రిటీష్ వారు తెచ్చిన ‘వరం’.. నేడు అడవులకు శాపం

ఈ మొక్క భారతదేశపు స్థానిక మొక్క కాదు. దీని మూలాలు దక్షిణ అమెరికాలో ఉన్నాయి. బ్రిటీష్ పాలనా కాలంలో, ఇక్కడి ఇళ్లకు అందాన్ని ఇవ్వడానికి, తమ సొంత దేశపు జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి బ్రిటీష్ వారు దీనిని భారత్‌కు తీసుకువచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు దీని పండ్లను తింటున్నప్పటికీ, దీని వెనుక దాగి ఉన్న అసలు విషయం మాత్రం భయంకరంగా ఉంది. అలంకరణ కోసం తెచ్చిన ఈ మొక్క, క్రమంగా అడవులకు అంటుకున్న ఒక అంతుచిక్కని వ్యాధిలా విస్తరించింది.

వన్యప్రాణుల ఆవాసాలపై రసాయనిక దాడి: 40 శాతం హ్యాబిటాట్ హరీ!

తలంబ్రాల పూల మొక్క కేవలం ఇతర మొక్కల స్థలాన్ని ఆక్రమించడమే కాదు, ఇది ఒక రకమైన రసాయనిక యుద్ధాన్ని (Chemical Warfare) ప్రకటిస్తుంది. దీని వేర్లలో ‘అలెలోపథిక్’ (Allelopathic) లక్షణాలు ఉంటాయి. అంటే, ఈ వేర్లు కొన్ని రకాల రసాయనాలను విడుదల చేస్తాయి, ఇవి చుట్టుపక్కల ఉన్న ఇతర స్థానిక మొక్కలు, గడ్డి లేదా చిన్న చెట్లు పెరగకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా, అతి తక్కువ కాలంలోనే ఆ ప్రాంతం మొత్తం కేవలం తలంబ్రాల మొక్కలతోనే నిండిపోతుంది.

ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, మన దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కన్హా, ముదుమలై టైగర్ రిజర్వ్‌లలో దాదాపు 40 శాతం ఆవాసాన్ని (Habit) ఈ మొక్కే ఆక్రమించింది. హిమాలయాల నుంచి పశ్చిమ కనుమల వరకు ఇది ఒక మహమ్మారిలా వ్యాపించింది. శాకాహార జంతువులకు ఆహారంగా ఉండాల్సిన సహజ సిద్ధమైన గడ్డి, మొక్కలను ఇది నాశనం చేయడంతో, అడవిలో ఆహార గొలుసు దెబ్బతింటోంది.

గ్రామాలపైకి వస్తున్న వన్యమృగాలు.. కారణం ఇదే!

ఇటీవలి కాలంలో పులులు, ఏనుగులు వంటి వన్యమృగాలు జనావాసాల వైపు రావడం మనం తరచుగా వార్తల్లో చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ఈ తలంబ్రాల మొక్కేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జంతువుల సహజ ఆవాసాలను ఇది ఆక్రమించుకోవడం వల్ల, వాటికి ఆహారం, నివసించడానికి తగిన స్థలం దొరకడం లేదు. దీంతో అవి తప్పనిసరి పరిస్థితుల్లో మనుషులు నివసించే ప్రాంతాల వైపు మళ్లుతున్నాయి. ఇది అటు వన్యప్రాణులకు, ఇటు మానవులకు మధ్య ఘర్షణను పెంచుతోంది.

తొలగింపు కష్టం.. అంతుచిక్కని పరిష్కారం

ఈ మొక్కను అడవి నుంచి తొలగించడం అంత సులభమైన పని కాదు. దీని కాండం మొత్తం ముళ్ళతో నిండి ఉండటమే కాకుండా, దీని వేర్లు భూమిలోకి చాలా లోతుగా చొచ్చుకుపోతాయి. పైన మొక్కను నరికివేసినా, వేర్ల నుంచి ఇది మళ్లీ మళ్లీ మొలుస్తూనే ఉంటుంది. దురదృష్టవశాత్తు, ఇంతటి తీవ్రమైన సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం వద్ద ఇప్పటివరకు ఎటువంటి నిర్దిష్టమైన లేదా పటిష్టమైన ప్రణాళిక (Concrete Plan) లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అడవులు అంతరించిపోకుండా ఉండాలంటే, తలంబ్రాల మొక్క విస్తరణను అడ్డుకోవడమే ఇప్పుడున్న ఏకైక మార్గం.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం