Padma Awards 2025: తారాలోకంపై BJPకి ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ అందుకేనా!

image credit: X

Padma Awards 2025:  పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ  సినీ తారలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. అర్హత ఉండి కూడా ఎవరెవరికి అవార్డ్ దక్కలేదో గమనించి వారిని పద్మ అవార్డు ప్రకటించి తారలపట్ల తమకున్న అభిమానం చాటుకుంటోంది. తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ కి 2017లో పద్మ విభూషణ్ ప్రకటించింది బీజేపీ ప్రభుత్వం. ఆ తర్వాత ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అనౌన్స్ చేసింది.

గతేడాది మరణించిన తమిళనాడు స్టార్ డీఎండీకే పార్టీ ప్రెసిడెంట్ అయిన విజయ్ కాంత్ కి కూడా మరణాంతరం పద్మభూషణ్ ప్రకటించింది కమలం పార్టీ. ఎందుకంటే ఆయనకు ప్రత్యేకంగా అభిమానం గణం ఉంది. తమిళనాట విజయ్ కాంత్ పార్టీ క్యాడర్ కూడా బలంగా ఉంది. దాంతో ఆ బలాన్ని తమకు అనుకూలంగా మార్చుకనేందుకు బీజేపీ ఇలా చేసిందనే టాక్ ఉంది.

లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన పద్మ అవార్డ్స్ లో.. తమిళ స్టార్ అజిత్ కుమార్ కి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రం . ఆయన మూడు దశాబ్దాలుగా సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. 1991లో ప్రేమ పుస్తకం అనే తెలుగు సినిమాతో కెరీర్ ప్రారంభించిన అజిత్ కి ఫుల్ ఫాలోయింగ్ ఉంది.

అయితే అజిత్ కి అవార్డ్ ప్రకటించడంపై అక్కడున్న మరో సూపర్ స్టార్ విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయింది. తమ హీరో రాజకీయాల్లోకి వస్తున్న వేళ తోటి స్టార్ కి పురస్కారం ఇవ్వడం రాజకీయం కాకుండా మరేంటని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి అజిత్ రాజకీయాలకు దూరంగా ఉంటాడు.. ఆయనకు ఎలాంటి రాజకీయ వాసనలు లేవు కానీ అన్నాడీఎంకే పార్టీ వారు ఎక్కువగా అభిమానిస్తారు అని చెబుతారు.

తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇలాంటి టైమ్ లో విజయ్ ఫ్యాన్స్ వైపు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో 2024ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. ఆయన ఈ అవార్డుకు అన్ని విధాలుగా అర్హుడే .. అయితే మెగాస్టార్ ని తమవైపు తిప్పుకోవాలని బీజేపీ సర్కార్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సమయం చూసి ఆ అవార్డ్ ప్రకటించారనే విమర్శలు వెల్లువెత్తాయ్.

లేటెస్ట్ గా నందమూరి నటసింహం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ దక్కింది. ఆయనకు అవార్డ్ రావడంపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంతోషంగా శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేరుగా బాలకృష్ణ ఇంటికి వెళ్లి మరీ అభినందించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. మరోవైపు చిరంజీవితోనూ సాన్నిహిత్యం ప్రకటిస్తున్నారు కిషన్ రెడ్డి.

ఓవరాల్ గా అవార్డ్ కోసం ఎంపిక చేసిన వ్యక్తులు, వాళ్లతో బీజేపీ శ్రేణులు నడుచుకుంటున్న తీరు చూస్తుంటే కమల దళానికి తారాలోకంపై ఎందుకింత ప్రత్యేక శ్రద్ధ అనే డిస్కషన్ జోరందుకుంది. బీజేపీ పెద్దల ప్రతి అడుగు వెనుకూ ఓ ఆంతర్యం ఉంటుందని మీకు అర్థమవుతోందా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు…

తరవాత కథనం