ఐపీఎల్ 18వ ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. దీంతో హైదరాబాద్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. మరో రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు ఆరంభం నుంచే షాక్‌లు తగిలాయి. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 1 పరుగుకే ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ 2 పరుగులు, నితీశ్ రెడ్డి డక్ ఔట్, ట్రావిస్ హెడ్ కేవలం 22 పరుగులకే నిరాశపర్చారు. దీంతో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కేవలం 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్రమైన కష్టాల్లో పడింది.
అదే సమయంలో అనికేత్ వర్మ సన్ రైజర్స్ జట్టుకు అండగా నిలిచాడు. 41 బంతుల్లో 74 పరుగులు చేసి అద్భుతమైన ఆటప్రదర్శన చేశాడు. అలాగే అతడికి తోడు క్లాసెన్ 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఇలా సన్ రైజర్స్ జట్టు 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్‌గా నిలిచింది. దీంతో ఈ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతోనే విజయం సాధించింది.
కేవలం 16 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. ఓపెనర్ డుప్లెసిస్ 27 బంతుల్లో 50 పరుగులు చేసి అదరగొట్టేశాడు. అలాగే జేక్ ఫ్రెజర్ 32 బంతుల్లో 38 పరుగులు సాధించాడు. ఇలా మరింత మంది పరుగులు రాబట్టడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది.