ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది మరణించారు. ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది. ఈ దాడిలో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం అయినట్లు సమాచారం. అనంతరం నిన్న పాకిస్తాన్.. జమ్మూ, పంజాబ్, రాజస్తాన్ లోని పలు ప్రాంతాల్లో దాడులకు ప్రయత్నించింది. కానీ వాటిని ఇండియన్ ఆర్మీ సమర్ధవంతంగా తిప్పికొట్టింది.
దీంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వాతావరణం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025ను బీసీసీఐ వారం రోజుల పాటు వాయిదా వేసింది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇచ్చింది. ఆటగాళ్ల ఆందోళనలు, అభిమానుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. దీనికి సంబంధించి అప్డేట్ చేయబడిన షెడ్యూల్ త్వరలో విడుదల అవుతుందని తెలిపారు.
దీంతో క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులు ఆందోళన చెందారు. మే 8 వరకు 58 మ్యాచ్‌లు జరిగాయి. అందులో పంజాబ్ కింగ్స్ (PBKS) vs ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఉంది. మే 8 (బుధవారం) ధర్మశాలలో జరగాల్సిన ఈ మ్యాచ్ భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తత కారణంగా మధ్యలో రద్దు అయింది. అనంతరం ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA)స్టేడియం ఖాళీ చేయబడింది.
కోల్‌కతాలో జరగనున్న ఫైనల్‌తో సహా ఐపీఎల్‌లో ఇంకా 12 లీగ్ మ్యాచ్‌లు, 4 నాకౌట్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. లీగ్ వర్గాల సమాచారం ప్రకారం, సైనిక ఘర్షణ విదేశీ ఆటగాళ్లలో తీవ్ర ఆందోళన కలిగించిందని.. వారు రాబోయే కొద్ది రోజుల్లో తిరిగి వస్తారని తెలుస్తోంది. గత సంవత్సరం, మెగా వేలంలో, 10 ఫ్రాంచైజీలు 62 మంది విదేశీ ఆటగాళ్లను ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ లీగ్ మే 25న కోల్‌కతాలో ముగియాల్సి ఉంది.