భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వాయిదా పడింది. దాదాపు వారం రోజుల పాటు ఈ లీగ్ను బీసీసీఐ వాయిదా వేసింది. చివరి మ్యాచ్ పంజాబ్ లోని ధర్మశాల లో జరిగింది. పంజాబ్ వర్సెస్ ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. సైరన్ మోగడంతో మ్యాచును మధ్యలోనే ఆపేసి స్టేడియంలో ఉన్న క్రికెట్ ప్రియులను బయటకు పంపించేశారు.
అనంతరం ఐపీఎల్ ను వారం రోజులు పాటు వాయిదా వేశారు. ఈ సీజన్లో ఇంకా 16 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐపీఎల్ ఉంటుందా ఉండదా అనే సందిగ్ధంలో ఉండిపోయారు. ఈ క్రమంలో తాజాగా ఓ వార్త ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహం నింపింది. మిగిలిన 16 మ్యాచ్లను దక్షిణ భారతదేశంలో ఆడించాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వేదికగా ఈ 16 మ్యాచ్లను నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశంలో ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిగిలిన మ్యాచ్లను దక్షిణాదిలో నిర్వహించాలని చూస్తున్నట్లు సమాచారం. ఉద్రిక్తంగా ఉన్నా సరిహద్దులకు దూరంగా దక్షిణాదికి చెందిన ఈ మూడు నగరాల్లో మిగతా ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించాలనే ప్రణాళికతో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే వారం తర్వాత ఐపీఎల్ మ్యాచ్లను తిరిగి ప్రారంభించడంలో ఎదురయ్యే సవాళ్ల గురించి బీసీసీఐ ఆయా ఫ్రాంచైజీలకు తెలియజేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం.. ఏడాది చివరి వరకు ఐపీఎల్ మ్యాచ్లు వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు విదేశీ ఆటగాళ్లు ఇప్పటికే ఇండియాను వదిలి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. వీరిలో కొంతమంది త్వరలోనే అంతర్జాతీయ మ్యాచులు ఆడనున్నారు. దీంతో ఒకవేళ ఐపిఎల్ ప్రారంభమైనా వారు తిరిగి రావడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి.