ODI World Cup: సెప్టెంబర్ 30న జరగబోయే వన్డే మహిళల ప్రపంచ కప్ కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. ఇటీవలే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 10 రోజుల పాటు కఠినమైన శిక్షణా శిబిరాన్ని పూర్తి చేశారు.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, హెడ్ కోచ్ అమోల్ మజుందార్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ క్యాంప్ జరిగింది. ఇందులో జట్టు ఫిట్‌నెస్‌ను పెంచడానికి, వారి నైపుణ్యాలను మెరుగుపరచాడనికి వివిధ రకాల వ్యాయామాలు, నైపుణ్యా శిక్షణలను అందించారు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, కొత్త వేదికలు
భారత మహిళా జట్టు ఇప్పటివరకు ఐసీసీ ప్రపంచ టైటిల్‌ను గెలవలేదు. దీనికి తోడు ఈసారి సొంతగడ్డపై ఆడుతున్నందున క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ ప్రపంచ కప్‌కు ముందు, భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో మూడు వన్డే సిరీస్‌లో తలపడనుంది. వాస్తవానికి ఈ సిరీస్ చెన్నైలో జరగాల్సి ఉండగా, స్టేడియం పునరుద్ధరణ పనుల కారణంగా చివరి నిమిషంలో వేదికలను మార్చారు.
మొదటి రెండు వన్డేలు న్యూ చండీగఢ్‌లోని కొత్త పీసీఏ స్టేడియంలో సెప్టెంబర్ 14, 17 తేదీల్లో జరుగుతాయి. చివరి వన్డే మ్యాచ్ న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సెప్టెంబర్ 20న జరుగుతుంది.
న్యూ చండీగఢ్‌లో మహిళల అంతర్జాతీయ మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి. ఢిల్లీలో 1985, 1995 తర్వాత మహిళల వన్డేలు జరగడం ఇదే మొదటిసారి.
టోర్నమెంట్ విశేషాలు
టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, “మొత్తం భారతీయులు ఎదురుచూస్తున్న ఈ కలను మేం సాధించగలమని అన్నారు. ప్రపంచ కప్‌లు ఎప్పుడూ ప్రత్యేకమే! నా దేశం కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని ఎప్పుడూ కోరుకుంటాను” అని తెలిపారు.
అయితే ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరగనుంది. ఇందులో ఎనిమిది జట్లు (ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక) పాల్గొంటాయి. విశాఖపట్నం, ఇండోర్, గువాహటి, కొలంబోలలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఐపీఎల్ విజయోత్సవాల సమయంలో బెంగళూరులో జరిగిన తొక్కిసలాట కారణంగా కర్ణాటక ప్రభుత్వం ఎం. చిన్నస్వామి స్టేడియాన్ని ఉపయోగించడానికి అనుమతి నిరాకరించింది. దీంతో ఆ స్థానంలో తిరువనంతపురం మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది. ఈసారి సొంతగడ్డపై జరగబోయే మ్యాచ్ లో భారత జట్టు తమ కలను నెరవేర్చుకుని ప్రపంచ కప్ గెలవాలని ఆశిస్తోంది.






