ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేయబోతుంది. అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధుల రిలీజ్‌కు రంగం సిద్ధం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ నిధులతో పాటే.. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ స్కీమ్ నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. త్వరలోనే ఈ నిధులను జమ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకంలో భాగంగా రైతులకు సంవత్సరానికి రూ.20 వేలు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. దీని డబ్బులు 3 విడతల్లో జమ చేస్తారు.
ఈ రూ. 20 వేలలో కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6,000లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.14,000 ఉంటాయి. ఇవి మొత్తం కలిపి రూ.20,000లను నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో మూడు దఫాల్లో జమ చేయనున్నారు. కాగా పీఎం కిసాన్ నిధులను జూలైలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. వీటితో పాటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ఈ స్కీమ్ అమలు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రకటన వెలువడింది.
పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 90 శాతం ఈకేవైసీ పూర్తయిందని అధికారులు తెలిపారు. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే.. వారు కౌలు గుర్తింపు కార్డు పొందాలని తెలిపారు. అంతేకాకుండా ఈ-పంటలో నమోదు అవ్వాలని సూచించారు.
దీంతోపాటు సొంత భూమి ఉన్న అసైన్డ్, డి-పట్టాదారులు, ఇనాం భూములు కలిగిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. వారు తప్పకుండా రెవెన్యూ అధికారిని సంప్రదించాలని పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 47.77 లక్షల రైతులు అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు.






