బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల వద్ద నమోదైన ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా, మొత్తం 29 మంది సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కేసు నమోదు చేసింది.
ఈ కేసులో నటులు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, వైకాపా అధికార ప్రతినిధి శ్యామల, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, మంచు లక్ష్మి, ప్రణీత, బుల్లితెర నటులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శ్రీముఖి, పద్మావతి, ఇమ్రాన్‌ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, శోభాశెట్టి, అమృతాచౌదరి, నయనిపావని, టేస్టీ తేజ, రీతూచౌదరి, బండారు సుప్రీత, నేహాపఠాన్, పండు, భయ్యా సన్నీయాదవ్ తదితరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
బీఎన్‌ఎస్‌లోని 318(4), 112, రెడ్‌విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్‌లోని 3, 3(ఎ), 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008లోని 66డి సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. వీరంతా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు భారీగా పారితోషికాలు తీసుకున్నారని, అయితే ఆ లావాదేవీలను తమ ఐటీ రిటర్న్స్‌లో చూపలేదని ఈడీ గుర్తించినట్లు సమాచారం.
ఈడీ అధికారులు ఇప్పటికే ఈ కేసులో అక్రమ నగదు లావాదేవీల కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో ఈ సినీ ప్రముఖులందరినీ విచారణకు పిలిచి స్టేట్‌మెంట్‌లను రికార్డు చేయనున్నారు. అవసరమైతే వారి నివాసాల్లో సోదాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
గతంలోనే ఈ బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు అనేక కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. ఈ కేసులో మరింత మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని పలు వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి.






