లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి తన పేస్ పదునుతో ఆతిథ్య జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఫైవ్ వికెట్ హాల్‌తో లార్డ్స్ ‘హానర్స్ బోర్డు’లో తన పేరును నమోదు చేసుకున్నాడు.
అయితే ఐదో వికెట్ తీసిన తర్వాత బుమ్రా పెద్దగా సంబరాలు చేసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా, ఒక బౌలర్ ఐదు వికెట్లు తీసినప్పుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతారు. కానీ బుమ్రా మాత్రం చాలా నిశ్శబ్దంగా కనిపించాడు. దీనిపై క్రికెట్ అభిమానుల్లో అనేక చర్చలు మొదలయ్యాయి.
మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఈ విషయంపై స్పష్టత ఇచ్చాడు. తన నిశ్శబ్దానికి అసలు కారణం అలసట అని చెప్పుకొచ్చాడు.
‘‘వాస్తవానికి, నేను ఆ సమయంలో బాగా అలసిపోయాను. అందుకే ఎక్కువ ఆనందించలేకపోయాను. మైదానంలో చాలా సేపు బౌలింగ్ చేయడంతో కొంత అలసటకు గురయ్యాను’’ అని బుమ్రా వివరించాడు.
అంతేకాకుండా ‘‘మైదానంలో ఎగిరి గంతులు వేయడానికి ఇప్పుడు నా వయసు ఏమీ 21-22 ఏళ్లు కాదు. సాధారణంగా నాకు అలాంటివి ఇష్టం ఉండవు. అయితే నా ప్రదర్శన పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంతేకాకుండా నేను వెంటనే నా బౌలింగ్ మార్కు వద్దకు తిరిగి వెళ్లి తదుపరి బంతిని వేయాలనుకున్నాను’’ అని బుమ్రా తెలిపాడు.
ఈ టెస్టులో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి రోజు 18 ఓవర్లు వేసిన బుమ్రా ఒక్క వికెట్ తీయగా, రెండో రోజు 9 ఓవర్లు వేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 27 ఓవర్లు వేసిన అతను 74 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇందులో నలుగురు బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. టెస్టుల్లో బుమ్రాకు ఇది 15వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన. ఈ ఫైవ్ వికెట్ హాల్‌తో విదేశాల్లో అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు సాధించిన భారత బౌలర్‌గా కపిల్ దేవ్ రికార్డును కూడా బుమ్రా అధిగమించాడు.
బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో పాటు, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్‌లు చెరో రెండు వికెట్లు తీయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో జో రూట్ (104) శతక్కొట్టగా, జేమీ స్మిత్ (51), బ్రైడన్ కార్స్ (56)లు అర్థశతకాలు సాధించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.






