భారత క్రికెటర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసీన్ జహాన్, కుమార్తె అర్షి జహాన్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లా, సూరి పట్టణంలోని వారి పొరుగింటి మహిళ దలియా ఖాతూన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఆస్తి వివాదం కారణంగా ఈ ఘటన జరిగిందని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..
సూరి పట్టణంలోని వార్డు నంబర్ 5లో నివసిస్తున్న హసీన్ జహాన్, అర్షి జహాన్ తమ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణం మొదలుపెట్టారు. అయితే, ఆ స్థలం తమదని వాదిస్తూ దలియా ఖాతూన్ ఆ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని, అది దాడిగా మారింది. హసీన్, అర్షి దలియా ఖాతూన్‌పై దాడి చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దలియా ఖాతూన్ ఫిర్యాదు మేరకు పోలీసులు BNSలోని 126(2), 115(2), 117(2), 109, 351(3), 3(5) సెక్షన్ల కింద హసీన్ జహాన్, అర్షి జహాన్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కాగా, ఇటీవలే కలకత్తా హైకోర్టు మొహమ్మద్ షమీ తన మాజీ భార్య హసీన్ జహాన్‌కు నెలకు రూ. 1.5 లక్షలు, కుమార్తెకు నెలకు రూ. 2.5 లక్షలు కలిపి మొత్తం రూ. 4 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ హత్యాయత్నం కేసు నమోదు కావడం గమనార్హం. షమీ ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఈ ఘటనతో షమీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.






