కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే విడుదలైన ‘కుబేర’ భారీ విజయం సాధించగా.. ఇప్పుడు తన 54వ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘పోర్ తొళిళ్’ ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ధనుష్ స్వయంగా తన సోషల్ మీడియాలో విడుదల చేశారు.
పోస్టర్‌లో ధనుష్ కాలిపోతున్న పత్తి పొలం ముందు తల దించుకుని నిలబడి ఉన్న దృశ్యం సినిమా కథాంశంపై తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. “కొన్నిసార్లు ప్రమాదకరంగా ఉండటమే బ్రతకడానికి ఏకైక మార్గం” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ సినిమా థ్రిల్లర్, క్రైమ్, భావోద్వేగ డ్రామా కలయికగా ఉండబోతుందని సూచిస్తోంది.
వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డాక్టర్ ఇషారి కె గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, జయరామ్, కె.ఎస్. రవికుమార్, సూరజ్ వెంజరమూడు వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ధనుష్‌కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్నందున, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.






