టాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, కిడ్నీ మార్పిడి అత్యవసరమని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్‌కు సుమారు రూ. 50 లక్షలు ఖర్చవుతుందని, అంత మొత్తం తమ వద్ద లేదని ఫిష్ వెంకట్ భార్య, కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ప్రభాస్ టీం నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని, కిడ్నీ మార్పిడికి అవసరమయ్యే రూ. 50 లక్షల సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజాగా ఫిష్ వెంకట్ కుమార్తెలు మీడియా ముందుకు వచ్చి ఈ వార్తలపై స్పష్టత ఇచ్చారు.
“ప్రభాస్ పీఏ అని చెప్పి ఒకరు మాకు ఫోన్ చేశారు. మా నాన్న ఆరోగ్య వివరాలు తెలుసుకుని, రూ. 50 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. కానీ, ఇప్పటివరకు వారి నుంచి ఎలాంటి సాయం అందలేదు. ఆ నంబర్‌కు తిరిగి కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు” అని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవైపు నాన్న ప్రాణాపాయ స్థితిలో ఉండగా, మరోవైపు ఇలాంటి తప్పుడు హామీలు, వదంతులు తమను మరింత కుంగదీస్తున్నాయని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు డబ్బు కన్నా కిడ్నీ దాతను కనుగొనడమే పెద్ద సమస్యగా మారిందని, సినీ పెద్దలు, దాతలు ముందుకు వచ్చి తమ తండ్రిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభాస్‌కు ఈ విషయం తెలిస్తే తప్పకుండా సాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంఘటన టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.






