పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “హరి హర వీర మల్లు” చిత్రం నుంచి మరో అదిరిపోయే పాట విడుదలైంది. “ఎవరది ఎవరది” అంటూ సాగే ఈ నాలుగో సింగిల్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతంలో ఈ పాట మాస్ బీట్ తో అలరిస్తోంది.
‘హరి హర వీర మల్లు’ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’, ‘అసుర హననం’ పాటలు ఆకట్టుకోగా, ఇప్పుడు విడుదలైన ‘ఎవరది ఎవరది’ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా కావడంతో, ఈ సినిమాలోని పాటలు కూడా అదే స్థాయిలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
క్రిష్ జాగర్లమూడి, ఎ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీపై పలు మార్లు వాయిదాలు పడినప్పటికీ, త్వరలోనే సినిమా థియేటర్లలోకి రానుంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఈ నెల అంటే జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ పాట సినిమా ప్రమోషన్లలో కీలక పాత్ర పోషిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.






