భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులో భాంగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ జూన్ 20న హెడింగ్లీలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. దీంతో హెడింగ్లీలో జరిగిన ఓటమిని మర్చిపోయి, ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న సెకండ్ మ్యాచ్‌కి టీం ఇండియా సిద్ధమవుతోంది. అయితే ఇక్కడ భారత్‌కు ఓ బిగ్ షాక్ తగిలింది. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్‌కు బుమ్రా దూరం కానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని జస్‌ప్రీత్ బుమ్రాకు రెండో టెస్ట్ మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వనున్నట్లు కొన్ని నివేదికలు వెలువడ్డాయి.
తొలి టెస్ట్‌లో మంచి లయలో కనిపించిన ఏకైక బౌలర్ బుమ్రా. తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసం సృష్టించి 5 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లు ఎవరూ పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయారు. ఇదే విషయంపై తాజాగా భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మాట్లాడారు. భారత జట్టు బుమ్రాపై ఎక్కువగా ఆధారపడకూడదని మహ్మద్ అజారుద్దీన్ అభిప్రాయపడ్డారు. రెండో టెస్ట్‌లో కుల్దీప్ యాదవ్‌కు జట్టు యాజమాన్యం అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు.
బుమ్రాపై ఆధారపడటం మంచిది కాదు
‘‘భారత జట్టు బుమ్రాపై ఎక్కువగా ఆధారపడింది. ఇది అంత సులభం కాదు.. ఎందుకంటే మీకు మరింత అనుభవజ్ఞులైన బౌలర్లు అవసరం. టీం ఇండియా అన్ని విధాలుగా కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలి’’ అని మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. జట్టులో స్పిన్నర్‌ను చేర్చడం ద్వారా భారత జట్టు బౌలింగ్ మరింత సమతుల్యంగా మారుతుందని అజారుద్దీన్ అభిప్రాయపడ్డారు.
తొలి టెస్ట్‌లో ఓటమికి భారత బ్యాట్స్‌మెన్ కారణమని మాజీ కెప్టెన్ నిందించాడు. ‘‘హెడింగ్లీలో మా తడబాటు బ్యాటింగ్ కారణంగా మేము ఓడిపోయాము. కానీ ఇప్పుడు జట్టు సరైన ఆటగాళ్లను ఎంచుకోవాలి. మా బౌలింగ్ పరిపూర్ణంగా ఉండాలి’’ అని ఆయన అన్నారు.
తొలి టెస్టులో ఓటమి
తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ గెలవడానికి టీమ్ ఇండియా 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, ఇంగ్లీష్ జట్టు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించింది. బెన్ డకెట్ జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసి 149 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో జో రూట్, జాక్ క్రౌలీ కూడా అర్ధ సెంచరీలు సాధించారు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ భారత బౌలర్ల ప్రదర్శన నిరాశపరిచింది.






