భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా చెలరేగిపోయాడు. ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో బుమ్రా భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. దీంతో బుమ్రాపై ప్రముఖ క్రికెటర్లు, మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగానే భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ బుమ్రాను ‘కోహినూర్ వజ్రం’తో పోల్చాడు.
రెండో రోజు తన ఓవర్లలో మూడు క్యాచ్‌లు వదిలినప్పటికీ, బుమ్రా మరుసటి రోజు పుంజుకుని క్రిస్ వోక్స్, జోష్ టంగ్‌లను అవుట్ చేశాడు. టీ విరామానికి ముందు అతను ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. దీంతో మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ స్కై స్పోర్ట్స్ క్రికెట్‌లో బుమ్రాను ప్రశంసించాడు.
దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. ‘‘కోహినూర్ వజ్రం లాంటి అమూల్యుడు బుమ్రా. ప్రతి ఫార్మాట్‌లో జట్టుకు అతను ఎంత ముఖ్యమో ప్రజలు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అతను ఏ ఫార్మాట్‌లోనైనా, ఓవర్‌లోని ఏ దశలోనైనా, ఏ బంతితోనైనా ఆటను తనకు అనుకూలంగా మార్చుకోగలడు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను బ్యాట్స్‌మన్ ఆలోచనలను చదివే మనస్సు కలిగి ఉంటాడు. చరిత్రలో 200 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లలో అతని సగటు అత్యుత్తమమైనది. ఇది అతను ఎంత ప్రత్యేకమైనవాడో తెలియజేస్తుంది’’ అని అన్నారు.
బుమ్రా 82 పరుగులు ఇచ్చి దాదాపు 5 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఇది అతనికి 14వ ఐదు వికెట్లు. ఈ టెస్టులో బుమ్రా ఒంటి చేత్తో భారత్‌ను మ్యాచ్‌లో ఆదుకున్నాడు. ఇతర భారత ఫాస్ట్ బౌలర్లు – శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కలిసి 288 పరుగులకు మూడు వికెట్లు మాత్రమే పడగొట్టారు.
ఈ సమయంలో బుమ్రా విదేశాల్లో 12 సార్లు ఐదు వికెట్లు తీసిన కపిల్ దేవ్ రికార్డును సమం చేశాడు. విశేషమేమిటంటే.. బుమ్రా కేవలం 34 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించగా.. కపిల్ 66 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు.






