teenmar mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి.. కవిత, మల్లన్నపై కేసు నమోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా శనివారం (జూలై 12) మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనతో అక్కడి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

కల్వకుంట్ల కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ, ఆమెను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం చెందిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాదాపు 25-30 మంది మేడిపల్లిలోని మల్లన్న కార్యాలయానికి చేరుకున్నారు. “జై కవితక్క” అంటూ నినాదాలు చేస్తూ, మల్లన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆవేశంతో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి ఫర్నిచర్, అద్దాలు, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. అదే సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది.

గాల్లోకి కాల్పులు జరిపిన గన్‌మెన్

దాడి జరుగుతున్న సమయంలో తీన్మార్ మల్లన్న కార్యాలయంలోనే ఉన్నట్లు సమాచారం. పరిస్థితి అదుపుతప్పుతున్న క్రమంలో.. ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (గన్‌మెన్) ఆందోళనకారులను చెదరగొట్టేందుకు గాల్లోకి 5 నుంచి 6 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జాగృతి కార్యకర్త సాయికి బుల్లెట్ గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం బుల్లెట్ గాయాలు కాలేదని, ఘర్షణలో గాయాలయ్యాయని చెబుతున్నారు. ఈ ఘటనలో ఇరువైపులా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇరువర్గాలను చెదరగొట్టి, కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి.

తీన్మార్ మల్లన్న ఫిర్యాదు

తనపై కవిత ప్రేరణతో జాగృతి కార్యకర్తలు దాడికి దిగారని, ఆస్తిని ధ్వంసం చేసి తనను హత్య చేసేందుకు యత్నించారని తీన్మార్ మల్లన్న తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఐపీసీ 147, 148, 452, 307 (హత్యాయత్నం), 427, 506, 353 రెడ్ విత్ 149, 109 సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

జాగృతి కార్యకర్తల ఫిర్యాదు

మరోవైపు, జాగృతి కార్యకర్త లింగమయ్య అలియాస్ అశోక్ యాదవ్ ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నపై కూడా కేసు నమోదైంది. మల్లన్న వ్యాఖ్యలపై ప్రశ్నించేందుకు క్యూన్యూస్ కార్యాలయం వద్దకు వెళ్లగా, మల్లన్న వర్గం తమపై దాడి చేసి కత్తులు, తుపాకులతో మహిళలను బెదిరించారని, మర్యాదకు భంగం కలిగించారని ఆరోపించారు. దీనిపై 354 బీ, 307, 506, 147, 148, ఆర్మ్స్ యాక్ట్ 25, 27 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం