అగ్నిజ్వాలల నడుమ కోనసీమ; ఇరుసుమండ బ్లోఅవుట్ వెనుక అసలు లోపమేంటి? భద్రతపై ప్రశ్నల వర్షం!

Konaseema gas blowout

ప్రకృతి ఒడిలో పెను విపత్తు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సోమవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించినట్లు భారీ శబ్దం వినిపించింది. మోరి–5వ నంబర్‌ బావి వద్ద సంభవించిన ఈ బ్లోఅవుట్‌ కారణంగా సహజ వాయువు ఆకాశాన్నంటేలా ఎగదన్నడమే కాకుండా, భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. పచ్చని కొబ్బరి తోటల మధ్య అగ్నికీలలు ఎగిసిపడటంతో స్థానిక ప్రజలు ప్రాణభయంతో ఇళ్లకు తాళాలేసి పిల్లాపాపలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

బ్లోఅవుట్ ఎలా సంభవించింది?

సాధారణంగా సహజ వాయువు వెలికితీత కోసం ఇనుప గొట్టాలతో డ్రిల్లింగ్‌ చేస్తున్నప్పుడు రాతిపొరలు తగిలితే, ఆ గొట్టం ద్వారా బాంబింగ్‌ చేయడం ఓఎన్‌జీసీ (ONGC) అధికారులకు పరిపాటి. ఈ ప్రక్రియలో ఒక్కసారిగా ఒత్తిడి పెరిగి సహజ వాయువు పెల్లుబికినప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. మంగళవారం మధ్యాహ్నానికి మంటల తీవ్రత 50 శాతం వరకు తగ్గినప్పటికీ, ఓ గొడుగు రూపంలో భారీ పైపుల ద్వారా నీటిని లోపలికి చొప్పిస్తూ మంటలను అదుపు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి.

చరిత్ర పునరావృతమవుతోందా?

కోనసీమ గడ్డపై ఇలాంటి ప్రమాదాలు కొత్తేమీ కాదు. 1993లో కొమరాడలో మొదలైన ఈ శబ్దఘోష, 1995లో పాశర్లపూడి 19ఏ బావి వద్ద సంభవించిన బ్లోఅవుట్‌తో పరాకాష్టకు చేరింది. ఆనాడు ఏకంగా 65 రోజుల పాటు కోనసీమ హడలెత్తిపోయింది. 2014లో నగరం గ్రామంలో గెయిల్ పైపులైన్ పేలి 22 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పటికీ పచ్చని కోనసీమ గుండెల్లో నిప్పులు పోస్తూనే ఉంది. తరచూ ఇలాంటి ఉదంతాలు జరుగుతున్నా, చమురు సంస్థలు భద్రతా ప్రమాణాలను విస్మరిస్తున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో పరిస్థితి: అధికారులు ఏమంటున్నారు? జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని, అయితే ధ్వంసమైన కొబ్బరి చెట్లకు పరిహారంపై అధికారులు దృష్టి సారించారు. మరో వారం రోజుల పాటు ఈ బ్లోఅవుట్ ప్రభావం కొనసాగే అవకాశం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓఎన్‌జీసీ సాంకేతిక నిపుణులు నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ, ప్రమాదం జరిగిన గంటన్నర వరకు వారు ఘటనా స్థలానికి చేరుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కార్పొరేట్ సంస్థల నిర్లక్ష్యం, భద్రత ఏటా వేల కోట్ల రూపాయల విలువైన చమురును తోడేస్తున్న సంస్థలు, అత్యవసర సమయాల్లో స్పందించే తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమస్య ఉత్పన్నమైనప్పుడు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి అవగాహన ఉందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF)ను ఇటువంటి సున్నిత ప్రాంతాలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పర్యావరణం, ఆర్థిక ప్రభావం సహజ వనరుల వెలికితీత వల్ల కోనసీమ పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. భారీ వాహనాల రాకతో రహదారులు ధ్వంసం కావడమే కాకుండా, కొబ్బరి, వరి దిగుబడి తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చమురు తోడేసిన ఖాళీల్లోకి సముద్రపు నీరు చేరడం వల్ల బావుల్లో నీరు ఉప్పగా మారి ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. తెలంగాణలోని సింగరేణి తరహాలో ఇక్కడి చమురు ఆదాయంలో తగిన వాటా రాష్ట్రానికి, ముఖ్యంగా కోనసీమ అభివృద్ధికి దక్కడం లేదన్నది వాస్తవం.

తరవాత కథనం