ఈ ఏడాది IPLలో RCB జట్టు అద్భుతంగా రాణించి టైటిల్ గెలుచుకుంది. యష్ దయాల్ ఈ జట్టులో ముఖ్యమైన పాత్ర పోషించాడు. తన బౌలింగ్ తో స్టార్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపించాడు. ఈ సీజన్ లో దయాల్ 15 మ్యాచ్ లలో 13 వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి స్టార్ బౌలర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు.
దయాల్ ఇప్పుడు పెద్ద ఇబ్బందుల్లో పడ్డాడు. అతడిపై ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ యువతి లైంగిక ఆరోపణలు చేసింది. తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. ఈ విషయంలో ఉన్నతాధికారి నుండి దర్యాప్తు చేయాలని ఆ మహిళ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు తన ఫిర్యాదును సీఎం యోగి కార్యాలయానికి పంపించింది.
తాను గత 5 సంవత్సరాలుగా యష్ దయాల్ తో రిలేషన్‌లో ఉన్నానని తెలిపింది. యష్ దయాల్ తనను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వేధించేవాడని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. యష్ దయాల్ తనతో పాటు ఇంకా చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు కలిగి ఉన్నాడని బాధితురాలు ఎఫ్ఐఆర్ లో ఆరోపించింది. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. 2025 జూలై 14న తాను మహిళా హెల్ప్‌లైన్ 181కి కాల్ చేసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించానని.. కానీ పోలీస్ స్టేషన్ నుండి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.
అందువల్ల ఇప్పుడు తాను న్యాయం కోసం నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి తన ఫిర్యాదు పంపించానని తెలిపింది. ఈ ఆరోపణలన్నింటినీ నిరూపించడానికి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని బాధితురాలు చెబుతోంది. ఈ కేసుకు సంబంధించిన చాట్‌లు, స్క్రీన్‌షాట్‌లు, వీడియో కాల్ రికార్డింగ్‌లు తన వద్ద ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసులో నిందితుడు యష్ దయాల్‌ను వీలైనంత త్వరగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది.






