‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార: ఏ లెజెండ్ – చాప్టర్ 1’ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. నేడు (జూలై 7, 2025) రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుకగా ఈ ప్రకటనను చేశారు. ఈ చిత్రం 2025 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ ప్యాన్ ఇండియా సినిమాను విడుదల చేయనున్నారు.
పవర్‌ఫుల్ లుక్‌లో రిషబ్ శెట్టి:
విడుదలైన కొత్త పోస్టర్‌లో రిషబ్ శెట్టి వీరోచితమైన, పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించి అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. చేతిలో గొడ్డలి, కవచంతో భయంకరమైన యోధుడి అవతారంలో రిషబ్ శెట్టి రౌద్రంగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో ఆయన ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రేక్షకులలో ఒక విధమైన ఆసక్తి నెలకొంది. అయితే ఈ కొత్త పోస్టర్ ఆ ఆసక్తిని రెట్టింపు చేసింది.
భారీ అంచనాలు, భారీ బడ్జెట్:
‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ‘కాంతార’ ఊహించని విజయం సాధించడంతో, ఈ ప్రీక్వెల్‌ను కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్‌తో సహా మొత్తం ఏడు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూడా తొలి భాగానికి అద్భుతమైన సంగీతం అందించిన బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు సమకూరుస్తున్నారు.
‘కాంతార: ఏ లెజెండ్ – చాప్టర్ 1’ చిత్రం సుమారు 125 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో 500 మంది శిక్షణ పొందిన యోధులు, మొత్తం 3000 మందితో కూడిన భారీ యుద్ధ సన్నివేశం కూడా ఉందని సమాచారం. రిషబ్ శెట్టి గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, పురాతన యుద్ధ కళ అయిన కలరిపట్టు వంటి వాటిలో శిక్షణ కూడా తీసుకున్నాడు.
అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా గురించి మరిన్ని అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






