బాలీవుడ్ నటి, మోడల్ షెఫాలి జరివాలా 42 ఏళ్ల వయస్సులో అకస్మాత్తుగా మరణించారు. అందుతున్న సమాచారం ప్రకారం.. షెఫాలికి గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. మొదట ఆమెకు గుండెపోటు వచ్చిన తర్వాత ఆమె భర్త పరాగ్ త్యాగి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నటి ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మరణ వార్త చిత్ర పరిశ్రమ, అభిమానులలో శోకసంద్రాన్ని నింపింది.
నటి మృతదేహాన్ని మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో అంధేరిలోని కూపర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పోస్ట్ మార్టం కోసం పంపారు. కూపర్ హాస్పిటల్ AMO (అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్) మాట్లాడుతూ.. మృతదేహాన్ని వేరే ఆసుపత్రి నుండి తీసుకువచ్చారు.. కాబట్టి మరణానికి కారణం పోస్ట్ మార్టం నివేదిక తర్వాత మాత్రమే తెలుస్తుంది అని అన్నారు.
ఇంతలో ముంబై పోలీసులు దర్యాప్తు కోసం అంధేరిలోని షెఫాలి ఇంటికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలంలో ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. షెఫాలి మరణం గురించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ.. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు చేస్తున్న తీరును బట్టి, కేసు అనుమానాస్పదంగా కనిపిస్తోంది.
‘కాంటా లగా’
షెఫాలీ జరివాలా తన అద్భుతమైన నటన, అందంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. 2002లో విడుదలైన ఐకానిక్ మ్యూజిక్ వీడియో ‘కాంటా లగా’లో ఆమె చేసిన డ్యాన్స్‌తో రాత్రికి రాత్రే పాపులర్ అయిపోయింది. షెఫాలీ గ్లామరస్ లుక్, టాటూలు, నడుముపై బొడ్డు బటన్, పియర్సింగ్‌లు, దుస్తులు ఆమెను ‘కాంటా లగా గర్ల్’గా ప్రసిద్ధి చెందాయి. ఇది కాకుండా ఆమె అనేక టీవీ సీరియల్స్, ప్రాజెక్టులలో పనిచేసింది.
ఇంకా షెఫాలీ బిగ్ బాస్ సీజన్ 13 లో కూడా కంటెస్టెంట్గగా ఉంది. ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోలో పాల్గొంది. ఆమె ప్రవర్తన, ఇతరుల పట్ల ప్రేమ ఆమెను ప్రేక్షకులలో అభిమానాన్ని సంపాదించిపెట్టింది. దీనితో పాటు, ఆమె డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే సీజన్ 5 లో పాల్గొంది.






