భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ భారీ స్కోర్ చేసింది. 587 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ చేయలేనిది కొత్త కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో గిల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్‌లో కెప్టెన్‌గా అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన భారత కెప్టెన్‌గా శుభ్‌మాన్ నిలిచాడు. అతను మొహమ్మద్ అజారుద్దీన్ రికార్డును బద్దలు కొట్టాడు. బ్యాట్స్‌మన్‌గా టెస్ట్ క్రికెట్‌లో గిల్ చేసిన తొలి డబుల్ సెంచరీ కూడా ఇది. దీనితో పాటు కెప్టెన్‌గా డబుల్ సెంచరీ చేసిన రెండవ అతి పిన్న వయస్కుడైన భారత కెప్టెన్ కూడా గిల్ కావడం విశేషం.
శుభ్‌మాన్ గిల్ ఇంగ్లాండ్ బౌలర్లకు కన్నీళ్లు పెట్టించాడు. 250కిపైగా పరుగుల మార్కును దాటాడు. 387 బంతుల్లో 269 పరుగులు సాధించాడు. అందులో 30 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. దీంతో భారతదేశం తరపున కెప్టెన్‌గా అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్‌మన్‌గా శుభ్‌మాన్ నిలిచాడు. విరాట్ కోహ్లీ ఆరేళ్ల రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. 2019లో దక్షిణాఫ్రికాపై కోహ్లీ అజేయంగా 254 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 107 బంతుల్లో 87 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 26 బంతుల్లో 2 పరుగులు సాధించాడు. కరుణ్ నాయర్ 50 బంతుల్లో 31 పరుగులు, రిషబ్ పంత్ 42 బంతుల్లో 25 పరుగులు, నితిశ్ కుమార్ రెడ్డి 6 బంతుల్లో ఒక్కపరుగు, రవీంద్ర జడేజా 137 బంతుల్లో 89 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 103 బంతుల్లో 42 పరుగులు, ఆకాశ్ దీప్ 13 బంతుల్లో 6 పరుగులు, సిరాజ్ 23 బంతుల్లో 8 పరుగులు, ప్రసిధ్ కృష్ణ 20 బంతుల్లో 5 పరుగులు సాధించారు.






