ENGw vs INDw 1st ODI: ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం.. చితక్కొట్టిన ఉమెన్స్

సౌతాంప్టన్‌లోని ఏజెస్ బౌల్ స్టేడియంలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మహిళల జట్టుపై భారత మహిళల జట్టు నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఇంగ్లాండ్ బ్యాటింగ్:

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఓపెనర్లు టమ్మీ బ్యూమోంట్ (5), అమీ జోన్స్ (1)లను యువ పేసర్ క్రాంతి గౌడ్ త్వరగా పెవిలియన్ చేర్చింది. ఆ తర్వాత కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్ (41), ఎమ్మా లాంబ్ (39) మూడో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అయితే, స్నేహ్ రాణా వారిద్దరినీ వరుస ఓవర్లలో అవుట్ చేసి ఇంగ్లాండ్‌ను కష్టాల్లోకి నెట్టింది. చివరకు, సోఫియా డంక్లీ (92 బంతుల్లో 83 పరుగులు, 9 ఫోర్లు), ఆలిస్ డేవిడ్‌సన్ రిచర్డ్స్ (53 పరుగులు) అద్భుతమైన అర్ధసెంచరీలు చేసి ఇంగ్లాండ్ స్కోరును 250 దాటించారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 2, స్నేహ్ రాణా 2 వికెట్లు తీయగా, అమన్జోత్ కౌర్, శ్రీ చరణి తలా ఒక వికెట్ సాధించారు.

భారత బ్యాటింగ్:

259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (28), ప్రతీక రావల్ (36) శుభారంభం ఇచ్చారు. ఆ తర్వాత హర్లీన్ డియోల్ (27) రాణించింది. అయితే, మధ్యలో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో భారత్ 124/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ (48) ఐదో వికెట్‌కు 90 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. దీప్తి శర్మ చివరి వరకు క్రీజులో నిలిచి 64 బంతుల్లో అజేయంగా 62 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్స్) చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. చివర్లో అమన్జోత్ కౌర్ 14 బంతుల్లో వేగంగా 20 పరుగులు (3 ఫోర్లు) చేసి దీప్తికి చక్కటి సహకారం అందించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో చార్లీ డీన్ 2 వికెట్లు తీయగా, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్, లారెన్ ఫిలెర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

తన అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించిన దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌ను విజయంతో ప్రారంభించి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది. రెండో వన్డే శనివారం జరగనుంది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం