డిస్నీ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ట్రాన్: ఆరీస్’ (Tron: Ares) చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే.. తాజాగా ఈ సినిమా అధికారిక తెలుగు ట్రైలర్ విడుదలై, సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
ట్రాన్ సిరీస్‌లో ఇది మూడవ భాగం. జోచిమ్ రోనింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆస్కార్ అవార్డు గ్రహీత జారెడ్ లెటో ‘ఆరీస్’ పాత్రలో నటించారు. గత చిత్రాల నుండి అభిమానులకు సుపరిచితుడైన జెఫ్ బ్రిడ్జెస్ మరోసారి ట్రాన్ యూనివర్స్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వడం ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. గ్రేటా లీ, ఇవాన్ పీటర్స్, హసన్ మిన్హాజ్, జోడీ టర్నర్-స్మిత్, ఆర్టురో కాస్ట్రో, కామెరూన్ మోనాఘన్, గిలియన్ అండర్సన్ వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘ట్రాన్: ఆరీస్’ కథ ఒక అత్యంత అధునాతన ఏఐ ప్రోగ్రామ్ అయిన ‘ఆరీస్’ చుట్టూ తిరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ డిజిటల్ ప్రపంచం నుండి నిజ ప్రపంచంలోకి ప్రమాదకరమైన మిషన్‌పై పంపబడుతుంది. మానవత్వం మొదటిసారి ఏఐ జీవులను ఎదుర్కొనే సందర్భం ఈ చిత్రంలో ప్రధానాంశం. ట్రైలర్ విడుదలైన వెంటనే, దాని విజువల్స్, విఎఫ్ఎక్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. గ్రామీ అవార్డు గెలుచుకున్న నైన్ ఇంచ్ నెయిల్స్ బ్యాండ్ స్వరపరిచిన “యాజ్ అలైవ్ యాజ్ యూ నీడ్ మీ టూ బీ” అనే పాట ఇప్పటికే సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
“ట్రాన్: ఆరీస్” చిత్రం అక్టోబర్ 10, 2025న తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లోని ఐమ్యాక్స్ థియేటర్లలో కూడా గ్రాండ్‌గా విడుదల కానుంది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత వస్తున్న ట్రాన్ సిరీస్‌లో ఈ కొత్త భాగం సైన్స్ ఫిక్షన్ అభిమానులకు గొప్ప అనుభూతిని అందిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.






