భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ ను ఇటీవల నిలిపివేశారు. చివరి మ్యాచ్ ధర్మశాల లో జరిగింది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. అయితే అదే సమయంలో యుద్ధ సైరన్ మోగడంతో ఈ మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. అనంతరం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ ను వారం రోజులపాటు వాయిదా వేసినట్లు తెలిపింది. దీంతో క్రికెట్ ప్రియులు చాలా నిరాశ చెందారు. అయితే కొద్ది రోజులకే భారత్, పాక్ కాల్పుల విరమణ ప్రకటించడంతో బీసీసీఐ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఐపీఎల్‌ను రీస్టార్ట్ చేసింది. మే 17వ తేదీ నుంచి మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయని పేర్కొంది.
దాదాపు 6 ప్రాంతాల్లో మిగిలిన 17 మ్యాచులు నిర్వహిస్తామని తెలిపింది. దీంతో ఐపీఎల్ అభిమానులు ఫుల్ కుష్ అయ్యారు. అయితే ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఒక చిక్కు వచ్చింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు తమ దేశానికి వెళ్లిపోయారు. ఇప్పుడు వారు ఇండియాకు రావడానికి నిరాకరిస్తున్నారు.
కొంతమంది ప్లేయర్లు ఇండియాకు వచ్చి ఐపిఎల్ ఆడడానికి ఇష్ట పెట్టుకోవడం లేదు. ఇంకొందరు అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం తమ దేశం లోనే ఉండిపోతున్నారు. మరికొందరు గాయాల కారణంగా, ఇంకొందరు వ్యక్తిగత కారణాలతో మ్యాచ్‌లకు దూరమయ్యారు. తరుణంలోనే ఫ్రాంచైజీలకు ఇబ్బంది కలగకుండా ఐపీఎల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే వారి ప్లేస్ లో కొత్తవారిని జట్టులోకి తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. దానికి కొన్ని కండిషన్లు పెట్టింది. ఈ ప్లేయర్ల రీప్లేస్మెంట్లు టెంపరరీ మాత్రమే అని తెలిపింది. ఇప్పుడు రీప్లేస్ చేసే వారిని వచ్చే సీజన్ కు రిటైన్ చేసుకోవడం అసలు కుదరదని స్పష్టం చేసింది. తాత్కాలికంగా వివిధ టీమ్‌లలో చేరే ప్లేయర్లు 2026 ఐపీఎల్ మినీ వేలంలో పేర్లను నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.