దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాయకత్వం వహించిన యుపిఐ లావాదేవీల రంగానికి రాబోయే రోజుల్లో కీలక పరీక్ష ఎదురుకానుంది. అక్టోబర్ 15, 2026 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన డిజిటల్ వ్యాపార యుపిఐ చెల్లింపులపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ రుసుము అమలులోకి రానుంది. ఈ కొత్త విధానంలో ఎండిఆర్ రుసుమును వినియోగదారుల నుంచి వసూలు చేయకూడదని, ఇది కేవలం వర్తకులకు మాత్రమే వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేశాయి. అయితే, ఆచరణలో వ్యాపారులు ఈ అదనపు చార్జీలను కస్టమర్లపైకి నెడితే, పెద్ద మొత్తాల చెల్లింపుల కోసం యుపిఐ వాడకాన్ని తగ్గించుకోవడానికి 76 శాతం మంది వినియోగదారులు సిద్ధంగా ఉన్నారని ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన జాతీయ సర్వేలో వెల్లడైంది.
దేశవ్యాప్తంగా 291 జిల్లాల నుంచి 67,000 మందికిపైగా యుపిఐ వినియోగదారుల స్పందన ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. వర్తకులు అదనపు రుసుమును వసూలు చేస్తే, కేవలం 14 శాతం మంది వినియోగదారులు మాత్రమే ఆ భారాన్ని భరించి యుపిఐ సేవలను కొనసాగిస్తామని తెలిపారు. మిగిలిన అత్యధిక శాతం వినియోగదారులు నగదు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ విధానాల వైపు మళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వ్యాపారులు అదనపు చార్జీ డిమాండ్ చేస్తే కస్టమర్ల ప్రాధాన్యతలు ఇవే
రూ.2,000దాటిన యుపిఐ లావాదేవీపై వర్తకుడు అదనపు రుసుం చెల్లించాలని కోరితే ఏం చేస్తారనే ప్రశ్నకు, 31,206 మంది వినియోగదారుల నుంచి వచ్చిన సమాధానాలు డిజిటల్ చెల్లింపుల రంగంలో రాబోయే మార్పులను సూచిస్తున్నాయి.
అత్యధికంగా 27 శాతం మంది వినియోగదారులు నేరుగా నగదు రూపంలోనే చెల్లింపులు పూర్తి చేస్తామని వెల్లడించారు. 26 శాతం మంది క్రెడిట్ కార్డు వైపు మళ్లుతామని చెప్పారు. 14 శాతం మంది డెబిట్ కార్డ్ వాడతామని పేర్కొన్నారు.
4 శాతం మంది బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ లేదా ట్రాన్స్‌ఫర్ విధానాన్ని ఎంచుకుంటామన్నారు. 9 శాతం మంది అదనపు చార్జీ లేని ఇతర చెల్లింపు విధానాన్ని ఇవ్వాలని వ్యాపారిని కోరతామని చెప్పారు. అదనపు చార్జీ పడినా యుపిఐనే వాడతామని చెప్పినవారు కేవలం 14 శాతం మంది మాత్రమే.
అంటే, ప్రతి ఏడుగురిలో ఒకరు మాత్రమే అదనపు భారాన్ని భరించి యుపిఐని కొనసాగించేందుకు సుముఖంగా ఉండగా, అత్యధికులు సాంప్రదాయ నగదు,కార్డ్ చెల్లింపుల వైపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కార్డులకు 39%, నగదుకు 26% మద్దతు
అదనపు రుసుము పడితే దీర్ఘకాలంలో చెల్లింపుల అలవాట్లు ఎలా మారతాయనే అంశంపై 37,654 మంది స్పందించగా, రూ. 2,000 దాటే కొనుగోళ్లకు యుపిఐనే ప్రధాన మార్గంగా ఉంచుకుంటామని చెప్పినవారు కేవలం 20 శాతం మంది మాత్రమే. మిగిలిన 76 శాతం మంది యుపిఐకి దూరంగా జరుగుతామని తెలిపారు.
దీర్ఘకాలిక ప్రత్యామ్నాయాల్లో క్రెడిట్ కార్డులకు 26 శాతం, నగదుకు 26 శాతం, డెబిట్ కార్డులకు 13 శాతం, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు 11 శాతం మంది మొగ్గు చూపారు. మొత్తంగా క్రెడిట్, డెబిట్ కార్డులు కలిసి 39 శాతం వాటాను దక్కించుకోగా, నగదు చెల్లింపులు 26 శాతంతో రెండో పెద్ద ప్రత్యామ్నాయంగా నిలిచాయి.
41% మంది ఎండిఆర్ భరించడానికి సిద్ధంగా లేరు
మరోవైపు ఈ 0.4% ఎండిఆర్ భారాన్ని వర్తకులు భరిస్తారా లేదా అనే అంశంపై కూడా తీవ్ర అనిశ్చితి నెలకొంది. 242 జిల్లాల్లోని 32,000 కంటే ఎక్కువ వ్యాపార సంస్థలపై నిర్వహించిన వేరొక లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం, కేవలం 17 శాతం మంది వర్తకులు మాత్రమే ఈ 0.4% ఎండిఆర్ భరించడానికి సుముఖత తెలిపారు.
ఏకంగా 41 శాతం మంది వ్యాపారులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఎండిఆర్ రుసుమును తాము భరించబోమని తేల్చిచెప్పారు. మరో 9 శాతం మంది అసలు తమ వద్ద యుపిఐ చెల్లింపులే స్వీకరించడం లేదని తెలిపారు. 15 శాతం మంది వర్తకులు గరిష్టంగా 0.04% ఎండిఆర్ మాత్రమే భరించగలమని స్పష్టం చేశారు. వ్యాపారులు ఈ రుసుమును తమ లాభాల మార్జిన్ల నుంచి భరించడానికి సిద్ధంగా లేకపోవడంతో, వినియోగదారులపైకి నెట్టే ప్రమాదం పొంచి ఉంది.
రూ. 5,000 లావాదేవీపై రూ. 20 రుసుము.. రూ. 50,000 పై రూ. 200!
లెక్కల ప్రకారం, 0.4% ఎండిఆర్ విధానంలో రూ. 5,000 విలువైన కొనుగోలుపై రూ. 20 ఎండిఆర్ రుసుము పడుతుంది. అదే రూ. 50,000 లావాదేవీపై రూ. 200 వరకు ఎండిఆర్ వర్తిస్తుంది. దీనికి తోడు ఎండిఆర్ రుసుముపై 18 శాతం జిఎస్‌టి (GST) కూడా అదనంగా ఉంటుంది.
భారీ కొనుగోళ్ల వద్ద ఈ రుసుము వినియోగదారుడికి ప్రత్యక్షంగా కనిపించే అవకాశం ఉండటంతో, ఇప్పటివరకు ఉచితంగా పొందిన డిజిటల్ సేవకు అదనంగా చెల్లించాల్సి రావడం కస్టమర్ల ప్రవర్తనపై ప్రభావం చూపుతోంది. గతంలో మార్చి 2025లో నిర్వహించిన సర్వేలో 73 శాతం మంది యుపిఐపై ఎలాంటి రుసుములు ఉండకూడదని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత
వినియోగదారులపై ఎలాంటి భారం పడకూడదనే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉంది. సెప్టెంబర్ 22న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడూ, “బాధ్యత కస్టమర్‌పై లేదు” అని, ఎండిఆర్ చార్జీలను వినియోగదారులకు బదిలీ చేయకూడదని స్పష్టం చేశారు.
ఎండిఆర్ అనేది ప్రభుత్వం లేదా ఎన్‌పిసిఐ (NPCI) వసూలు చేసే పన్ను లేదా రుసుము కాదని, డిజిటల్ నెట్‌వర్క్ నిర్వహించే బ్యాంకులు, యుపిఐ యాప్‌లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య పంచుకునే రుసుము అని ఆర్థిక శాఖ తెలిపింది. వర్తకులు కస్టమర్ల నుంచి ఈ రుసుమును వసూలు చేయకుండా పర్యవేక్షించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)తో కలిసి ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా, ప్రాంతీయ భాషల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని యోచిస్తోంది.
96% లావాదేవీలకు మినహాయింపు.. కానీ విలువలో 67% వాటా!
కొత్త ఎండిఆర్ నిబంధనల నుంచి చిన్న వ్యాపారులకు, సామాన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణ కల్పించింది. పూర్తిగా ఉచితం, ఎలాంటి ఎండిఆర్ ఉండదు. ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు పంపే నగదుపై ఎలాంటి రుసుము ఉండదు. యుపిఐ క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు రూ. 1 లక్ష వరకు స్వీకరించే చిన్న వ్యాపారులకు ఎండిఆర్ నుంచి మినహాయింపు లభిస్తుంది.
ఈ మినహాయింపుల వల్ల సంఖ్యాపరంగా 96 శాతం మర్చంట్ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం పడదని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, మిగిలిన 4 శాతం పెద్ద లావాదేవీలే డబ్బు పరిమాణం దృష్ట్యా అత్యంత కీలకమైనవి.
2026 ఆగస్టు నెలలో యుపిఐ ద్వారా మొత్తం 24.51 బిలియన్ లావాదేవీల రూపంలో రూ.29.82 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఇందులో వర్తకులకు చేసిన చెల్లింపులు (P2M) 15.51 బిలియన్ లావాదేవీలతో రూ. 8.95 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఈ మర్చంట్ చెల్లింపుల మొత్తం విలువలో రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీల వాటా ఏకంగా 67 శాతంగా ఉంది. అంటే ఎలక్ట్రానిక్స్, షాపింగ్, ట్రావెల్, రెస్టారెంట్లు, గృహోపకరణాల కొనుగోళ్ల వంటి పెద్ద వ్యాపార లావాదేవీలపై ఈ ఎండిఆర్ రుసుము ప్రభావం చూపనుంది.
వర్తకులు అదనపు రుసుమును కస్టమర్లకు బదిలీ చేస్తే దానికి సంబంధించి ఫిర్యాదు చేయడం లేదా రీఫండ్ పొందే స్పష్టమైన యంత్రాంగాన్ని నిబంధనల్లో ఇంకా చేర్చలేదని లోకల్ సర్కిల్స్ పేర్కొంది. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానం భారతదేశపు డిజిటల్ చెల్లింపుల ప్రయాణంలో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి.