Aryaman Birla: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. లీగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యం మారింది. దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఆర్సీబీని రికార్డు స్థాయి ధరకు కొనుగోలు చేసింది. ఈ భారీ డీల్ విలువ సుమారు 1.78 బిలియన్ డాలర్లు (రూ. 16,000 కోట్లకు పైమాటే) అని సమాచారం. ఈ విక్రయ ప్రక్రియ పూర్తి కావడంతో, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా కుమారుడు, మాజీ క్రికెటర్ ఆర్యమన్ బిర్లా ఫ్రాంచైజీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
రికార్డు స్థాయి ధర.. 100 శాతం వాటా కైవసం
బ్రిటన్‌కు చెందిన డియాజియో పీఎల్‌సీ అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీని ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కూటమి కొనుగోలు చేసింది. ఈ కన్సార్టియంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌తో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, డేవిడ్ బ్లిట్జర్ నేతృత్వంలోని బోల్ట్ వెంచర్స్, అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడి సంస్థ బ్లాక్ స్టోన్ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ ఒప్పందంతో ఆర్సీబీ పురుషుల జట్టుతో పాటు మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) లోని బెంగళూరు జట్టు వంద శాతం వాటాలు ఈ కొత్త యాజమాన్యం పరమయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఇది అత్యంత ఖరీదైన డీల్స్‌లో ఒకటిగా నిలిచిపోనుంది.
ఎవరీ ఆర్యమన్ బిర్లా? క్రికెట్ పిచ్ నుంచి బోర్డ్ రూమ్ వరకు..
ఆర్సీబీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోబోతున్న ఆర్యమన్ బిర్లా (28) కేవలం ఒక పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, ఆయనకు క్రికెట్‌తో విడదీయరాని సంబంధం ఉంది. మధ్యప్రదేశ్ తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడిన అనుభవం ఆయనకు ఉంది. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ఆర్యమన్, మధ్యప్రదేశ్ తరపున 9 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 414 పరుగులు చేశారు. ఇందులో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బెంగాల్‌పై సాధించిన ఒక సెంచరీ కూడా ఉంది. అంతేకాకుండా, 4 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో కూడా ఆయన ప్రాతినిధ్యం వహించారు.
ప్రస్తుతం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, రూ. 7 కోట్లకు ఆర్సీబీ దక్కించుకున్న వెంకటేష్ అయ్యర్‌లతో కలిసి ఆర్యమన్ డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం విశేషం. ఇప్పుడు తన పాత సహచరులు ఆడుతున్న జట్టుకే ఆయన బాస్ కాబోతున్నారు.
రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు.. ఇప్పుడు ఆర్సీబీ బాస్!
ఆర్యమన్ బిర్లాకు ఐపీఎల్ కొత్తేమీ కాదు. 2018లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ (RR) ఆయనను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, ఆ జట్టు తరపున ఆయనకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. 2020 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఆయనను విడుదల చేసింది. విచిత్రమేమిటంటే, ఒకప్పుడు ఏ జట్టులోనైతే ఆటగాడిగా బెంచ్ మీద కూర్చున్నారో, ఇప్పుడు అదే ఐపీఎల్ లీగ్‌లో మరో పెద్ద జట్టుకు చైర్మన్‌గా వ్యవహరించబోతున్నారు.
మానసిక ఆరోగ్యం కోసం విరామం.. తిరిగి శక్తివంతంగా రాక
క్రికెట్ కెరీర్ పతాక స్థాయిలో ఉన్న సమయంలోనే ఆర్యమన్ బిర్లా ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తీవ్రమైన ఆందోళన , మానసిక ఒత్తిడి కారణంగా 2020లో క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “నేను ఇరుక్కుపోయినట్లు అనిపిస్తోంది.. నా ఆరోగ్యం, శ్రేయస్సు కంటే ఏదీ ముఖ్యం కాదు” అని ఆనాడు ఆయన రాసిన సందేశం క్రీడాకారుల్లో మానసిక ఆరోగ్యంపై పెద్ద చర్చకే దారితీసింది. ఆ తర్వాత ఆయన తిరిగి మైదానంలోకి అడుగుపెట్టలేదు. ప్రస్తుతం ఆయన ఆదిత్య బిర్లా మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
“ఆర్సీబీని కొత్త శిఖరాలకు చేరుస్తాం”: ఆర్యమన్ బిర్లా
ఈ కొత్త బాధ్యతపై ఆర్యమన్ బిర్లా స్పందిస్తూ.. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. “ఆర్సీబీ వృద్ధిలో తదుపరి దశను నిర్మించడానికి ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుంది. క్రీడలు, మీడియా, వినియోగదారుల వ్యాపారాలపై ఉన్న అవగాహనతో జట్టును ముందుకు తీసుకెళ్తాం” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మార్చి 28న ఆరంభ పోరు.. ఎస్ఆర్‌హెచ్‌తో అమీతుమీ
యాజమాన్యం మారిన నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 2026 షెడ్యూల్ ప్రకారం, మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తొలి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. కొత్త యాజమాన్యం, కొత్త చైర్మన్ ఆధ్వర్యంలో ఆర్సీబీ మరోసారి కప్పు గెలిచి ‘ఈ సాలా కప్ నమ్దే’ అన్న నినాదాన్ని నిజం చేస్తుందో లేదో వేచి చూడాలి.





